Share News

కల్యాణలక్ష్మి నిలిపివేతపై సర్కారు అప్పీల్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 07:02 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విధించిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది.

కల్యాణలక్ష్మి నిలిపివేతపై సర్కారు అప్పీల్‌
Kalyana Lakshmi

  • మధ్యంతర ఉత్తర్వుల మీద

  • అప్పీల్‌ కుదరదన్న హైకోర్టు రిజిస్ట్రార్‌

  • అభ్యంతరాలను కొట్టివేసిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విధించిన స్టేను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. అయితే, సింగిల్‌ జడ్జి ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులేగానీ తుది తీర్పు కాదు కాబట్టి.. మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్‌ విచారణార్హం కాదని పేర్కొంటూ, మరికొన్ని ఇతర కారణాలు చూపుతూ ప్రభుత్వ అప్పీల్‌కు హైకోర్టు రిజిస్ట్రీ రెగ్యులర్‌ నెంబర్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, రిజిస్ట్రీ అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పేద, నిమ్న వర్గాలకు చెందిన యువతుల వివాహానికి ఆర్థికసాయం చేయడం ద్వారా ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు. ఈ పథకాలు బాల్య వివాహాలను అరికట్టటానికి ఉపయోగపడుతున్నాయి. వీటిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో ఎటువంటి ప్రజాప్రయోజనం లేదు’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణార్హత ఉందా? అన్న అంశాన్ని పరిశీలించింది. సంక్షేమ పథకాలను అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న విచక్షణాధికారం అని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌కు రెగ్యులర్‌ నెంబర్‌ను కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. అప్పీల్‌పై నేడు విచారణ జరగనుంది.


ఇవి కూడా చదవండి

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలనకు 1000 రోజులు

చేయూత గడువు పెంపు

Updated Date - Sep 01 , 2026 | 07:02 AM