గురుకుల పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ప్రిన్సిపాల్‌ను డిస్మిస్ చేయాలి
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:12 AM
కరీంనగర్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర-81 పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ప్రిన్సిపాల్‌ను డిస్మిస్ చేయాలని, ఆ పాఠశాలలో ర్యాగింగ్, వేధింపులపై సమగ్ర విచారణ జరపాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ర్యాగింగ్, వేధింపులపై సమగ్ర విచారణ జరపాలి
విద్యార్థి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకుల డిమాండ్
పంజాగుట్ట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కరీంనగర్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర-81 పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ప్రిన్సిపాల్‌ను డిస్మిస్ చేయాలని, ఆ పాఠశాలలో ర్యాగింగ్, వేధింపులపై సమగ్ర విచారణ జరపాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వేన్కేపల్లి గ్రామానికి చెందిన బాధిత విద్యార్థి కె.అక్షిత్ తల్లిదండ్రులు మహేందర్, శ్రీలత వివిధ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. కరీంనగర్ శివారు బొమ్మకల్ గ్రామంలోని మైనారిటీ గురుకుల బాలుర-81 పాఠశాలలో 9వ తరగతి చదువుతోన్న అక్షిత్‌ను గత నెల మొదటి వారంలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని, బలవంతంగా మద్యం తాగించి దాడి చేశారని తెలిపారు.
ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ వీర్ల మహేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తమ కుమారుడిని తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అనంతరం గత నెల 6న ప్రిన్సిపాల్ తమకు ఫోన్ చేసి అక్షిత్‌కు జ్వరం వచ్చిందని చెప్పారని, తాము వెళ్లి చూడగా బాలుడి ఒంటిపై కొట్టిన గాయాలు కనిపించాయని వివరించారు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కొద్ది రోజులు కోమాలోకి వెళ్లాడని వాపోయారు. ప్రస్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, భయపడుతున్నాడని చెప్పారు. తాము పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీయగా కొట్టినట్టు అంగీకరించారని తెలిపారు. బాలుడి వైద్య చికిత్సకు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు అయ్యిందన్నారు. ఈ ఘటనపై తమ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, 40 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని, ప్రిన్సిపాల్‌ను డిస్మిస్ చేయాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో కురుమ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మారిషస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ