Share News

భూముల చిక్కుముడులు వీడేనా?

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:47 AM

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తోంది. భూముల వివరాల పునఃపరిశీలన, అధికారాల వికేంద్రీకరణ, అవసరమైన చట్ట సవరణలపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది.

భూముల చిక్కుముడులు వీడేనా?
Revanth Reddy land reforms

  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటన నేపథ్యంలో కసరత్తు ప్రారంభం

  • 22ఏతోపాటు ఇతర భూ సమస్యలపై మార్గదర్శకాల జారీకి యత్నాలు

  • వివాదంలో ఉన్న భూముల లెక్కలను తిరిగి తనిఖీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం

  • నేడు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నెల రోజుల్లో 22ఏ నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ప్రస్తావించిన 12 అంశాల ప్రాతిపదికన రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులతో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం సమావేశం అయ్యారు. లోకేష్‌ ఛైర్మన్‌గా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులివ్వనున్నట్లు సమాచారం.


అనంతరం.. కమిటీ సమావేశమై అంశాల వారీగా నెల రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారంపై నిర్ణయం తీసుకోనుంది. 22ఏ వివాదంతోపాటు ఇతర భూ సమస్యలన్నింటికి పరిష్కారం చూపేలా మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. భూ సమస్యల చిక్కుముడి విప్పేందుకు అవసరమైతే చట్ట సవరణలు చేసేందుకు కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. సీఎం ప్రకటన నేపథ్యంలో అధికారులు, రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా భూముల వివరాలను మరోసారి సేకరించే పనిలో పడ్డారు. నిషేధిత భూములతోపాటు ఇతరత్రా వివాదాలు, ఇతర క్యాటగిరీలకు చెందిన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. 22ఏ భూముల సమస్యల పరిష్కారానికి అధికారాల వికేంద్రీకరణతోపాటు నిర్దిష్టమైన విధివిధానాలను ఖరారు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.


కలెక్టర్ల అధికారాలను తగ్గించి.. ఆర్డీవో, సబ్‌ కలెక్టర్లకు నిర్ణయాధికారాలు ఇస్తారని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా 22ఏ జాబితాలో మార్పులు, చేర్పులకు ఎవరిని బాధ్యులను చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 22ఏపై రకరకాల జాబితాలు ఉండటంతో ఆ జాబితాలో ఆస్తులు ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐజీఆర్‌ఎస్‌, రెవెన్యూ శాఖల వద్ద ఒకే తరహా జాబితాను నిర్వహించాలనే చర్చ ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఒకే భూమికి రెండు వేర్వేరు జాబితాలు ఉండటంతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతోపాటు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. 22ఏ జాబితాలో ప్రస్తుతం ఉన్న సర్వే నంబరు, విస్తీర్ణం, భూమి క్యాటగిరి వంటి వివరాలు సరిపోవని, వీటితోపాటు నిర్ణయం తీసుకున్న అధికారి పేరు, హోదా, జాబితాలో పెట్టడానికి కారణాలు, దానికి సంబంధించిన రుజువుల పీడీఎఫ్‌ పత్రాలు, కోర్టు ఆదేశాలు, ఇతరత్రా ప్రభుత్వ ఉత్తర్వులు.. అన్నింటినీ ఒకే చోట క్రోఢీకరిస్తే ప్రజల్లో గందరగోళం ఉండదని, అధికారుల్లో జవాబుదారీతనం ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. 22ఏలో సవరణలకు సంబంధించి కూడా బాధితులకు నోటీసు ఇవ్వడం, విచారణ జరపటం, స్పీకింగ్‌ ఉత్తర్వులు జారీ చేయటం వంటి ప్రక్రియలను నూతన మార్గదర్శకాల్లో పొందుపరిచే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.


క్యాటగిరీలపైనా స్పష్టత ఇవ్వాలి

22ఏలో ఉన్న ఏ క్యాటగిరి నుంచి ఈ క్యాటగిరి వరకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. నిషేధిత భూమి వక్ఫ్‌ పరిధిలో ఉంటే బాధితులు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇచ్చే మార్గదర్శకాలలో వివిధ క్యాటగిరిల్లో ఉన్న బాధితులకు రెవెన్యూ అధికారి వద్దనే ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. వేగంగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని భూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ, వక్ఫ్‌, అటవీ భూముల విషయంలో గెజిట్‌ ప్రకటనలో ఉన్న వివరాల మేరకే 22ఏ జాబితాలో పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే, వీటిని పట్టించుకోకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు తీసుకున్న నిర్ణయాలతో సమస్య జఠిలంగా మారిందని అంటున్నారు. 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నా కొన్ని చోట్ల నిషేధిత జాబితాలో భూములను చేర్చిన ఉదంతాలు ఉన్నాయి. 1958కి ముందు అసైన్‌ చేసిన భూములను 22ఏలో పెట్టొద్దని కోర్టు చెప్పినా కూడా చాలా చోట్ల వాటిని కూడా నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు. ఎక్స్‌ సర్వీస్‌, ఫ్రీడమ్‌ ఫైటర్‌ తదితర విభాగాల కింద ఉన్న నిషేధిత భూముల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తే తప్ప సమస్య తీవ్రత తగ్గే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులూ చేపట్టాలి

ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత, వాటికి అనుగుణంగా భూభారతి సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని, చట్టంలోనూ కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుందని భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌ పేర్కొన్నారు. 22ఏ జాబితాలను గ్రామాల వారీగా ప్రజల ముందు పెట్టి బాధితుల అభిప్రాయాలు సేకరిస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. 22ఏ జాబితాల నుంచి తొలగించిన భూముల వివరాలను కూడా గ్రామాల వారీగా అందుబాటులో ఉంచేలా రెవెన్యూ శాఖ నిర్ణయం తీకోవాలని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

1954లోనే మాకు వందల ఎకరాలు

2004లో కేసీఆర్‌కు భూమే లేదు

Updated Date - Sep 18 , 2026 | 05:04 AM