Share News

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:28 AM

తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెడికల్‌ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(..

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సమస్యలు పరిష్కరించాలి

  • బోధన సిబ్బంది కొరత తీర్చాలి..

  • తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు..

  • హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలి

  • సీఎం ప్రజావాణిలో పేరెంట్స్‌ అసోసియేషన్‌ వినతి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెడికల్‌ స్టూడెంట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌(తెలంగాణ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం సీఎం ప్రజావాణిలో నోడల్‌ ఆఫీసర్‌ కె. విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ రిమ్స్‌ బాలికల హాస్టల్‌లో నీటి సమస్య, ఫ్యాకల్టీ, హెచ్‌వోడీల కొరత, జగిత్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభంలో జాప్యం, జనగాం మెడికల్‌ కాలేజీలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర సమస్యలను వివరించారు. ఆసిఫాబాద్‌ మెడికల్‌ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌పై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, మహేశ్వరం మెడికల్‌ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.


అలాగే అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హాస్టళ్లలో వేడి నీటి కోసం సురక్షితమైన గీజర్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్‌ భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు విద్యా నష్టం జరగకుండా ప్రత్యక్ష తరగతులు, ప్రాక్టికల్స్‌, క్లినికల్‌ పోస్టింగ్‌లు సక్రమంగా నిర్వహించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపై నోడల్‌ ఆఫీసర్‌ కె. విద్యాసాగర్‌ సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్‌ ప్రతినిధులు డీఎంఈ కార్యాలయాన్ని కూడా సందర్శించి అక్కడి అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 05:28 AM