Share News

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:08 PM

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని గిరిజనుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలకు పరిహారం అందిస్తూ పునరావాస ప్రక్రియను ప్రారంభించింది.

అమ్రాబాద్ గిరిజనుల పునరావాసం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Amrabad Tiger Reserve Rehabilitation

హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నివసిస్తున్న గిరిజనుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల అభీష్టం మేరకే పునరావాసం చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి దశలో నాలుగు గ్రామాలకు చెందిన 417 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అసెంబ్లీ కౌన్సిల్ హాల్‌లో 14 గిరిజన కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు.


ఈ పథకంలో భాగంగా 160 కుటుంబాలకు నగదు పరిహారం ఇవ్వగా, 257 కుటుంబాలకు ఇల్లు, 5 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బచారం వద్ద ఆధునిక సదుపాయాలతో పునరావాస కాలనీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.62.55 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. పునరావాసం తర్వాత గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. గిరిజన పిల్లలకు ఆధునిక పాఠశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కూడా కల్పించనున్నారు.


దేశంలోనే అత్యధిక పరిహారాల్లో ఒకటిగా భావిస్తున్న రూ.15 లక్షల ప్యాకేజ్ ద్వారా గిరిజనులకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా, ఈ పునరావాసం ద్వారా సుమారు 1501 హెక్టార్ల అటవీ భూమి పునరుద్ధరణకు అవకాశం లభించనుంది. పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు ఇది కీలకంగా మారనుంది. బచారం పునరావాస కాలనీని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


Also Read:

ఆ ఇళ్లను కొత్త వారికి ఇస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ.. ఎవరేమన్నారంటే..

For More Latest News

Updated Date - Mar 25 , 2026 | 07:11 PM