Share News

పెట్టుబడులకు గ్లోబల్‌హబ్‌గా తెలంగాణ

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:33 AM

రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

పెట్టుబడులకు గ్లోబల్‌హబ్‌గా తెలంగాణ

  • యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం

  • పికో టెక్నాలజీ ప్రారంభోత్సవంలో మంత్రులు దుద్దిళ్ల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచ స్థాయి పారిశ్రామిక సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకురావడంతో పాటు యువత నైపుణ్యానికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ సంస్థ ‘పికో టెక్నాలజీ ఇండియా’ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


‘‘పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తూ పరిశ్రమల స్థాపనకు పూర్తి ప్రోత్సాహం ఇస్తున్నాం. కొత్త సంస్థల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా యువతకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుంది.’’ అని వివరించారు. రాష్ట్ర పెట్టుబడుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేందుకు తాము తీసుకొచ్చిన గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమం కీలక వేదికగా నిలిచిందని చెప్పారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. పికో టెక్నాలజీ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.


19 నుంచి ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ భేటీలు

19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో, దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, ఇంజనీర్లు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 05:33 AM