Share News

ఫ్యూచర్‌ సిటీలోకి ‘మహేశ్వరం’!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:59 AM

ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని 71 గ్రామాలు ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) పరిధిలో ఉండగా.. మరిన్ని గ్రామాలను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఫ్యూచర్‌ సిటీలోకి ‘మహేశ్వరం’!
Future City Hyderabad

  • మొత్తం మండలం విలీనం దిశగా అడుగులు

  • ప్రస్తుతం 2 గ్రామాలు మాత్రమే ఎఫ్‌సీడీఏలో.. మరో 32 గ్రామాలూ విలీనమయ్యే అవకాశం

  • కందుకూరు మండలంలో మిగతా గ్రామాలూ..

  • మరింతగా విస్తరించనున్న ఫ్యూచర్‌ సిటీ

  • స్థానికుల విజ్ఞప్తులపై సర్కార్‌ సానుకూల స్పందన

  • రంగారెడ్డి కలెక్టర్‌కు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం

  • త్వరలోనే ఆ గ్రామాల విలీనానికి నోటిఫికేషన్‌?

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్‌సిటీని మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని 71 గ్రామాలు ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ) పరిధిలో ఉండగా.. మరిన్ని గ్రామాలను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే, మహేశ్వరం మండలంలోని 32 రెవెన్యూ గ్రామాలు, కందుకూరు మండలంలోని మిగిలిన గ్రామాలను సైతం ఎఫ్‌సీడీఏలో చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఆయా గ్రామాల విలీనం పూర్తయితే మహేశ్వరం, కందుకూరు మండలాలు పూర్తిగా ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి రానున్నాయి.


రాజధాని హైదరాబాద్‌కు సమీపంలోనే మరో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నూతన నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశంలోనే మొదటిసారి నెట్‌జీరో గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీని నిర్మించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ను సైతం సిద్ధం చేయడమే కాకుండా ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎఫ్‌సీడీఏ పరిధిలో 71 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే, మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో చేర్చాలంటూ స్థానికులు ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు కందుకూరు, మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని గ్రామాల నుంచి తీర్మానాలు అందకపోవడంతో విలీనంపై అధ్యయనం చేసి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని అన్ని గ్రామాలను ఎఫ్‌సీడీఏలో చేర్చేందుకు కసరత్తు ప్రారంభం కాగా.. త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది.


హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌సీడీఏలోకి

ప్రస్తుతం ఎఫ్‌సీడీఏ పరిధిలో మహేశ్వరం మండలంలోని మొహబత్‌నగర్‌, తమ్ములూరు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. మిగతా 32 రెవెన్యూ గ్రామాలైన అకన్‌పల్లి, ఆల్మా్‌సగూడ, అమీర్‌పేట, బాగ్‌మంఖాల్‌, దబిల్‌గూడ, దిల్వార్‌గూడ, దుబ్బచెర్ల, గంగారం, ఘట్‌పల్లి, గొల్లూరు, ఇమాంగూడ, కల్వకోల్‌, కోళ్లపడ్కల్‌, కొంగర కుర్దు, మహేశ్వరం, మలిక్దాన్‌గూడ, మంఖాల్‌, మన్‌సాన్‌పల్లి, మొహబ్బత్‌నగర్‌, నాగారం, నాగిరెడ్డిపల్లి, నందపల్లి, పెండ్యాల, పోరండ్ల, రావిర్యాల, సర్దార్‌నగర్‌, సిరిగిరిపూర్‌, శ్రీనగర్‌, సుభాన్‌పూర్‌, తుమ్మలురు, తుప్రాకుర్దు, వెంకన్నగూడను త్వరలో ఎఫ్‌సీడీఏలో విలీనం చేయనున్నారు.


కందుకూరు మండలానికి సంబంధించి దాసర్లపల్లి, అన్మోజిగూడ, దెబ్బడగూడ, గూడూరు, గుమ్మడవెల్లి, కందుకూరు, కొత్తూరు, గఫూర్‌నగర్‌, లేమూర్‌, మాధాపూర్‌, మీర్‌ఖాన్‌పేట-బేగరికంచ, మహమదానగర్‌, ముచ్చర్ల, పంజగూడ, రాచులూరు, సార్వరావులపల్లి, తిమ్మాపూర్‌, మురళీనగర్‌, దన్నారం, చిప్పలపల్లి, నేదునూరు, అక్బర్జ, అలీఖాన్‌పల్లి, బాచుపల్లి, పెరుగడ్డ, పులిమామిడి, జైత్వారం కల్సా, జైత్వారం మక్తా గ్రామాలు ఫ్యూచర్‌సిటీ పరిధిలో ఉండగా.. మిగతా గ్రామాల విలీనానికి కసరత్తు చేస్తున్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలన్నీ కూడా ఎఫ్‌సీడీఏలో విలీనమైతే.. లేఅవుట్ల అనుమతుల కోసం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని స్థానికులు అభిపాయ్రపడుతున్నారు. మీర్‌ఖాన్‌పేట-బేగరికంచెలో ఉన్న ఎఫ్‌సీడీఏ కార్యాలయంలోనే అనుమతులు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


మొదట 56 గ్రామాలతో మాస్టర్‌ప్లాన్‌

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 56రెవెన్యూ గ్రామాల పరిధిలో... 30వేల ఎకరాల్లో....మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని తొలుత మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. కొన్ని రోజుల క్రితం మరో 15 గ్రామాలు విలీనం అయ్యాయి. వీటితో యాచారం మండలంలోని అన్ని గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి చేరాయి. దీంతో మొత్తం ఎఫ్‌సీడీఏ పరిధి ప్రస్తుతం 71 రెవెన్యూ గ్రామాలకు చేరింది. మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాలు విలీనం కానుండటంతో ఎఫ్‌సీడీఏ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే ఎఫ్‌సీడీఏలో విలీనమైన గ్రామాల్లో ఉన్న నీటి వనరులు, భూములు, ఇళ్లు, తదితర లెక్కలు తీస్తున్నారు. సరిహద్దులను గుర్తించి మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ఇళ్లతోపాటు ప్రభుత్వ, అటవీ, పట్టా భూములు, తదితర పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సన్నద్ధమవుతున్నారు.


ఈ వార్తలూ చదవండి

వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా

Updated Date - Oct 19 , 2026 | 05:00 AM