Share News

ఎండిన చెరువుల్లో చేపపిల్లలు బతికేదెట్లా?

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:58 AM

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకుంటున్న వేళ మత్స్యశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఎండిన చెరువుల్లో చేపపిల్లలు బతికేదెట్లా?
Telangana Fisheries

  • రూ.133 కోట్ల ప్రజాధనం బురదపాలు చేసేందుకు మత్స్యశాఖ కసరత్తు!

  • వర్షాభావంతో ఎండిపోయిన 12,944 చెరువులు

  • అయినా పంపిణీకి అధికారుల తొందర

  • నిబంధనల సడలింపుపై కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు

  • చేపపిల్లల సరఫరా కంటే.. ప్రత్యక్ష నగదు బదిలీకి మత్స్యకారుల డిమాండ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయలు అలుముకుంటున్న వేళ మత్స్యశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల చెరువుల్లో నీటిమట్టం ఘోరంగా పడిపోయినప్పటికీ, రూ.133 కోట్ల ఖర్చుతో చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28,678 నీటి వనరుల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పోయడానికి మత్స్యశాఖ ఇటీవల టెండర్లు ఖరారు చేసింది. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య కురిసే వర్షాలతో చెరువులు నిండిన తర్వాత ఈ కార్యక్రమం చేపడితే మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నీటిపారుదల శాఖ నివేదిక ప్రకారం చిన్న నీటిపారుదల పరిధిలోని 17,677 చెరువుల్లో సగానికి పైగా నీటి నిల్వలు పడిపోగా, 12,944 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేపపిల్లలను పోస్తే అవి బతికే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే..

మరోవైపు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే మత్స్యశాఖ నిబంధనలను సడలిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకం నిబంధనల ప్రకారం కనీసం 6 నెలల పాటు నీటి నిల్వ ఉండి, 50 శాతం నీటిమట్టం ఉన్న చెరువుల్లోనే చేపపిల్లలను వేయాలి. అందువల్ల చేపపిల్లలు వేసేందుకు కలెక్టర్లు, స్థానిక అధికారులు వెనకాడటంతోకాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. నీటి నిల్వ పమిరిమితిని 50 శాతం నుంచి 33 శాతానికి తగ్గిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారనే చర్చ జరుగుతోంది. లాభాల కోసం ప్రాజెక్టును త్వరగా ముగించాలనే కాంట్రాక్టర్ల తాపత్రయం వల్ల రూ.133 కోట్ల నిధులు నీళ్లపాలు కానున్నాయని మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎండిపోయిన చెరువుల్లో చేపపిల్లలను వేసి నిధులను వృఽథా చేయడానికి బదులుగా, ‘రైతుభరోసా’ తరహాలో ఆ నిధులను మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు నేరుగా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా

Updated Date - Oct 19 , 2026 | 05:58 AM