Share News

‘ఎల్‌నినో’ను దీటుగా ఎదుర్కొందాం

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:10 AM

‘ఎల్‌నినో’ను దీటుగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని.. కరువు పరిస్థితులను ఎదుర్కొనడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం వివిధ శాఖల అధికారులను ఆదేశించింది.

‘ఎల్‌నినో’ను దీటుగా ఎదుర్కొందాం
Bhatti Vikramarka

  • ఇందుకోసం సమగ్ర కార్యాచరణ..

  • తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలి

  • కరువు మండలాలను గుర్తించాలి: భట్టి

  • కలెక్టర్లు ప్రతి వారం సమీక్షించాలి: ఉత్తమ్‌

  • భూగర్భ జలాలపై నివేదికలివ్వాలి: తుమ్మల

  • 7వేల కోట్లతో సహాయక చర్యలు: సీతక్క

  • ఎల్‌నినోపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

  • త్వరలో అఖిలపక్ష సమావేశ నిర్వహించాలని నిర్ణయం

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ఎల్‌నినో’ను దీటుగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని.. కరువు పరిస్థితులను ఎదుర్కొనడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం వివిధ శాఖల అధికారులను ఆదేశించింది. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, గ్రామీణ ఉపాధి రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించింది. ఈ నెల 31లోపు కరువు మండలాలను ప్రకటించాలని, త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించింది. ఎల్‌నినోపై ఏర్పాటైన ఈ ఉప సంఘంతొలి సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


శాస్త్రీయంగా కరువు మండలాల గుర్తింపు: భట్టి

కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా గుర్తించాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడమే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. కరువు తీవ్రత అధికంగా ఉన్న మండలాలతోపాటు 20 శాతానికి మించి కరువు ప్రభావం ఉన్న మండలాలను కూడా పరిశీలించాలని సూచించారు. కరువు మండలాల ప్రకటన కోసం అన్ని వివరాలను సిద్ధం చేయాలన్నారు. కరువు ప్రభావాన్ని ముందుగానే అంచనా వేస్తే.. ప్రజలకు సకాలంలో సహకరించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.


తాగునీటికి ప్రాధాన్యమిస్తూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి ఇంధన శాఖ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యవసర ఖర్చుల కోసం నిధులను సర్దుబాటు చేయడానికి ఆర్థిక శాఖ ప్రణాళికబద్ధంగా పని చేయాలని సూచించారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ కరువు ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించారు.


నీటి ఎద్దడి పరిస్థితుల్లో వరి వేయొద్దని.. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మండలాల్లో భూగర్భ జలాల మట్టాలు, ఎండల తీవ్రత వంటి వివరాలపై ప్రతి వారం నివేదికల రూపంలో విడుదల చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరు, ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లకు అవసరమైన ప్రత్యేక నిధులను కేటాయించాలని మంత్రి సీతక్క చెప్పారు. ప్రస్తుతం రూ.7000 కోట్లతో కరువు సహాయక పనులు చేపడుతున్నామని వివరించారు.


చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నందున.. పెద్ద రిజర్వాయర్లలో చేప పిల్లలను వదిలేందుకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. ఇప్పటికే ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున అత్యవసర నిధులను విడుదల చేశామని సీఎస్‌ సంజయ్‌ జాజు తెలిపారు. తక్కువ వర్షపాతం, పంటల విస్తీర్ణం 50 శాతానికంటే తక్కువగా ఉండట వంటి అంశాల ఆధారంగా 358 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని వివరించారు.

Updated Date - Oct 24 , 2026 | 05:10 AM