Share News

కొత్త సినిమాల పైరసీ గుట్టు రట్టు

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:58 AM

సినిమాల పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రట్టు చేశారు.

కొత్త సినిమాల పైరసీ గుట్టు రట్టు

  • మొబైల్‌ ద్వారా రికార్డింగ్‌..

  • వెబ్‌సైట్‌లో అప్‌లోడింగ్‌

  • ఇద్దరిని అరెస్టు చేసిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సినిమాల పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రట్టు చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు చెందిన యాంటీ పైరసీ సెల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన అధికారులు.. 24 గంటల్లోనే పైరసీ రాకెట్‌లో కీలకమైన ఇద్దరిని ఏపీలోని కర్నూలులో అరెస్టు చేశారు. కర్నూలులో సిటీస్క్వేర్‌ మాల్‌లో ఉన్న ఎస్‌వీసీ సినిమాస్‌ నుంచి కర్నూలుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌, రాంపోగు అజయ్‌లు కొత్తగా విడుదలైన సినిమాలను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసి గోఫైల్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆ వెంటనే పైరసీ రాకెట్‌ ముఠా ఈ సినిమాలను గో2.ఇండియా4మూవీస్.క్లిక్‌ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించిన ప్రకటనలు ఇస్తూ బెట్టింగ్‌ వైపు యువతను ఆకర్షిస్తున్నారు.


ఇటీవల విడుదలైన రామాయణ, సీన్‌, మహాశక్తి, ఈఎన్‌ఈ రిపీట్‌, ఆకాశంలో ఒక తార, ఓం, కల్ట్‌, ఆదర్శ కుటుంబం సినిమాలను వీరు రహస్యంగా చిత్రీకరించి ఒకొక్క సినిమాను రూ.20 వేలకు అమ్ముకున్నారు. పైరసీ సినిమాలను కొనుగోలు చేస్తున్న ముఠా.. వీరు అప్‌లోడ్‌ చేసిన ప్రతి సినిమాకు రూ.20 వేలను క్రిప్టో కరెన్సీ రూపంలో వీరి వాలెట్లకు బదిలీ చేస్తున్నారు. సినిమాలను కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్‌ తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కలిసి యాంటీ పైరసీ యూనిట్‌ ఏర్పాటు చేసి మానిటరింగ్‌ ప్రారంభించామని చెప్పారు. ఈ మేరకు అందిన సమాచారం మేరకు పైరసీ సినిమాలను అప్‌లోడ్‌ చేస్తున్న, ప్రదర్శిస్తున్న 42,151 యూఆర్‌ఎల్స్‌ను బ్లాక్‌ చేశామని చెప్పారు. ప్రధాన హోస్టింగ్‌ సర్వర్లకు 87 నోటీసులు జారీ చేశామని, 8 మంది అనుమానితులను గుర్తించి ఇప్పటి వరకు 5గురిని అరెస్టు చేశామని తెలిపారు. యాంటీ పైరసీ చర్యల వల్ల గత ఏడు నెలల్లో 20కి పైగా సినిమాలను పైరసీ నుంచి కాపాడి సినీ పరిశ్రమకు రూ.33.6 కోట్ల నష్టాన్ని నివారించామని శిఖా గోయల్‌ తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 06:58 AM