Share News

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:45 AM

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి..

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

  • భట్టి, పొన్నం, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేస్తాం.. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు

  • ప్రాజెక్టును అడ్డుకోవడం మానుకోవాలి

  • బీఆర్‌ఎస్‌ ప్రారంభించి వదిలేస్తే..మేం ముందుకు తీసుకెళుతున్నాం

  • 50 మీ. బఫర్‌జోన్‌ నిర్ణయం బీఆర్‌ఎస్దే

  • అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దు

  • శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి.. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని సూచించారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, దీనిపై వారికి ఉన్న అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ రివర్‌ డెవలమెంట్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించింది తామేనని చెప్పుకొనే బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు. ‘‘మీరు ప్రారంభించి వదిలేస్తే.. మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వాలి. 50 మీటర్ల బఫర్‌ జోన్‌ పరిధిని నిర్ణయించింది కూడా మీరే. దీనిపై అభ్యంతరాలు తెలపాలని సమావేశానికి ఆహ్వానిస్తే.. రాలేదు. ఆన్‌లైన్‌లో వివరాలు చూసి అయినా సలహాలిస్తారనుకుంటే.. అదీ చేయలేదు’’ అని సీఎం అన్నారు. తనకు సూచనలు ఇవ్వడం వారికి ఇబ్బంది అనుకుంటే.. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇవ్వవచ్చన్నారు. కలుషిత మూసీ జలాల వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొనే సమస్యలను కళ్లారా చూసిన వారెవరైనా ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పరని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలని, రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారెవరినీ నిరాశ్రయులను చేయబోమని, మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని తెలిపారు. ఎవరూ రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దన్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని, అభివృద్ధికి అడ్డుపడవద్దని కోరారు.

హైదరాబాద్‌ అంటే రాక్స్‌, లేక్స్‌ సిటీ..

ఏ రాష్ట్రం ప్రగతి అయినా ఆ రాష్ట్రంలో ఉన్న నగరాల నిర్మాణం, నిర్వహణ, ఆ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను బట్టి నిర్ణయిస్తారని సీఎం రేవంత్‌ అన్నారు. దేశంలో ఎన్నో నగరాలున్నా.. ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటామని, అందులో పొలిటికల్‌ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్‌ రాజధానిగా ముంబై, ఐటీ రాజధానిగా బెంగళూరు, తయారీ రంగ రాజధానిగా చెన్నై, ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ నగరాల గురించి చర్చించుకుంటామని పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం కారణంగా స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారు. పరిశ్రమలను మూసేస్తున్నారు. నగరంలో తిరిగే వాహనాలకు నిబంధనలు తెస్తున్నారు. ముంబైలో వర్షాలు వేస్త కదల్లేని పరిస్థితి.. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్‌. చెన్నైకి వెళ్తే పడవల్లో తిరగాల్సిన పరిస్థితి. కానీ, హైదరాబాద్‌ రాక్స్‌ అండ్‌ లేక్స్‌ సిటీ. కులీ కుతుబ్‌షాహీలు, నిజాంలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ నగరాన్ని నిర్మించి, విస్తరించి చారిత్రక నగరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ను ఓల్డ్‌ సిటీ అని మనం చెప్పుకొంటున్నాం. కానీ, అది ఒరిజినల్‌ సిటీ. చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, ఉస్మానియా హాస్పిటల్‌, మనం ఉన్న శాసనమండలి, ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.


మానవ తప్పిదాలతోనే కాలుష్య సమస్యలు..

ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగిందని, వీటికి రోడ్ల విస్తరణతోపాటు పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్‌-2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. ఔటర్‌ రింగురోడ్డు లోపలి ప్రాంతమంతా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీగా పేర్కొన్నాం. మొత్తం 2073 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోటి 34 లక్షల జనాభా ఉన్నారు. ఈ ప్రాంతంలో రెడ్‌, ఆరెంజ్‌ క్యాటగిరీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు బయటకు తరలిస్త్తే.. ఆ పరిశ్రమలు ఉన్న దాదాపు 4500 ఎకరాల భూమి (రోడ్లు, పార్కులు, లేఅవుట్‌లు పోను) మధ్య, దిగువ తరగతి ప్రజలు కొనుక్కోవడానికి అందుబాటులోకి వస్తుంది. కాలుష్యాన్ని కూడా నియంత్రించినట్లవుతుంది’’ అని రేవంత్‌ అన్నారు. రోడ్లను అండర్‌పాస్‌, సర్ఫేస్‌, ఎలివేటెడ్‌ కారిడార్‌ అని మూడు భాగాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించామని, ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా విస్తరిస్తున్నామని చెప్పారు. శామీర్‌పేట్‌, మేడ్చల్‌ వైపు ఎలివేటెడ్‌ కారిడార్‌లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కంటోన్మెంట్‌ భూములకు మరో చోట భూములు ఇస్తామని ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి కూడా అండర్‌పాస్‌ రోడ్డుకు అనుమతి తీసుకొచ్చామని, దేశంలో రన్‌వే కింద ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదని తెలిపారు. నగరంలో సిగ్నల్‌ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలనేది తమ ప్రయత్నమన్నారు.


గండిపేట-గౌరెల్లికి భూసేకరణ అవసరం లేదు..

కొంత కఠినం అనిపించినా ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నామని సీఎం రేవంత్‌ చెప్పారు. ఫుట్‌పాత్‌పై ఉండే చిరు వ్యాపారుల కోసం ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. హిల్ట్‌ పాలసీలో ఇండస్ట్రియల్‌ జోన్‌కు మల్టీ జోన్‌గా భూమిని బదలాయిస్తున్నామని, అంతే తప్ప.. ఎవరికీ యాజమాన్య హక్కులు కల్పించడం లేదని స్పష్టం చేశారు. ‘‘సాధారణంగా హిమాయత్‌ సాగర్‌ నుంచి గౌరెల్లి (రామోజీ ఫిలింసిటీ దగ్గర)కి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీనికి తగ్గించేందుకు గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ వెంట సిటీ మధ్యలో నుంచి ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించబోతున్నాం. దీంతో కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణంతో గౌరెల్లికి చేరుకోవచ్చు. దీనికోసం రూ.కోట్లతో భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. మూసీ పరివాహకం నుంచే ఈ కారిడార్‌ను ఏర్పాటు చేస్తే మూసీ సుందరీకరణతోపాటు, అభివృద్ధి కూడా జరుగుతుంది’’ అని సీఎం అన్నారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లను అభివృద్ధి చేసేందుకు దూర దృష్టితో ప్రణాళికలు రూపొందించామని, పారదర్శకంగా పనులు జరిగేలా ప్రతి విభాగానికీ ఒక పాలసీ తెచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు దృష్టి సారించాల్సింది గుడ్‌ గవర్నెన్స్‌పై కాదని, స్మార్ట్‌ గవర్నెన్స్‌, పరిపాలనా సౌలభ్యం, అధికారుల మధ్య సమన్వయం ఉండడమని అన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని, నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశామని ప్రకటించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని, ఎన్నికలొచ్చినపుడు చేద్దామని అన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 06:21 AM