తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..
ABN , Publish Date - May 21 , 2026 | 02:57 PM
కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్: కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు. కార్మికుల కనీస వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని.. అందుకే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించామని అన్నారు. సబ్ కమిటీ నివేదించిన అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు కేటగిరీలుగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు. కార్మికులను నాలుగు కేటగిరీలుగా చేశాం. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా విభజించాం. వర్క్ జోన్లను మూడు భాగాలుగా విభజించాం. జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్స్, జోన్-2లో మున్సిపాలిటీలు, జోన్-3లో గ్రామీణ ప్రాంతాలను తీసుకుని కనీస వేతనం నిర్ణయించాం. అన్‌స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు పెంచాం. సెమీ స్కిల్డ్ కేటగిరీలో రూ.13,152 నుంచి రూ.17 వేలకు.. స్కిల్డ్ కేటగిరీలో రూ.13,772 నుంచి రూ.18,500కు పెంచాం. హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుంచి అమలవుతుంది.
ఐటీ, అమెరికా ఆలోచనలు వద్దు..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. గత ప్రభుత్వం తన బాధ్యతను వదిలేసింది. మా ప్రభుత్వం బాధ్యతతో వారి ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకుంది. కార్మిక నాయకుడంటే వెంకటస్వామి గుర్తొస్తారు. ఆయన వారసుడిగా మంత్రి వివేక్ వెంకటస్వామి.. కార్మికుల సంక్షేమం కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. యువతకు నేను ఒకటే సూచన చేస్తున్నా. ఐటీ, అమెరికా అనే ఆలోచనను వీడండి. ఉద్యోగాలు రాని, ఉపాధి అవకాశాలు లేని చదువులు వ్యర్థం. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి ఇతర దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా యువత దృష్టి సారించాలి.
ధరలు రోజూ పెంచుతారా?
ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోంది. అందుకే ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారు. మా ప్రభుత్వం ప్రతి అంశాన్నీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తుంది. అందుకే కార్మికుల కనీస వేతనం పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ 80 శాతం పూర్తయింది. ఇంకా 20 శాతం మిగిలి ఉంది. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నేతలు మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. రైతుల విషయంలో శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహరిస్తారా?. నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి.
బండి సంజయ్ అప్పగించలేదు..
పోక్సో కేసులో బండి భగీరథ్‌ను పోలీసులే అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని అప్పగించి ఉంటే తమ ఇంట్లోనే అప్పగించి ఉండేవారు. పోక్సో కేసులో ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో ఓడించాలి.. అంతేకాని దిగజారి ప్రవర్తించొద్దు. కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ దొరికినా నోటీసు ఇచ్చి విచారించాం. బండి భగీరథ్ విషయంలోనూ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నాం. పోక్సో కేసులో పోలీసులు ప్రొసీజర్ ప్రకారమే వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగంలోనే ఉన్నానని అనుకుంటున్నారు.
కేసీఆర్ బయటకు రారా?
కేసీఆర్ దిగిపోయి చాలా రోజులు అయ్యింది. పార్టీ మీటింగ్ కోసం జగిత్యాలకు వెళ్లిన కేసీఆర్.. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు బయటకు రాలేదు?. కులగణన విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి అన్ని వివరాలు ప్రజల ముందుంచాం. 'జనగణనలో కులగణన' విషయంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచింది. మోదీ ప్రభుత్వం తక్షణమే జనగణనలో కులగణన చేర్చి బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలి' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను కలిసిన మంత్రి తుమ్మల.. చర్చించిన అంశాలివే
మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది కార్లు దగ్ధం