వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు..
ABN , Publish Date - Aug 07 , 2026 | 07:39 PM
తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. అధికారం చేపట్టే విషయంలో ఎవరితోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.
ఢిల్లీ: తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. అధికారం చేపట్టే విషయంలో ఎవరితోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. అయితే, ఎన్డీయే కూటమిలో జనసేన పార్టీ భాగస్వామి అని, దానిపై జాతీయస్థాయిలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై కీలకంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. సంస్థాగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగింది. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 937 మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ తరహాలో ఇక్కడా విజయం సాధించి అధికారం చేపడతామన్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా బీజేపీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతల మధ్య విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని రాంచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారని చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని రాంచందర్ రావు తెలిపారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నితిన్ నబీన్.. రాష్ట్రానికి వస్తారని, ఇక్కడి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్రజా సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. కాగా, ఈ సమావేశంలో సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ వంటి నేతలు కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కస్టమర్‌లా వచ్చి బంగారంతో ఉడాయించిన దొంగలు.. వీడియో వైరల్
మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్..