తెలంగాణ అసెంబ్లీ విస్తరణకు మాస్టర్ ప్లాన్.. కొత్త భవనాలు, పార్కింగ్‌కు ప్రతిపాదనలు..
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:59 PM
తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రాంగణాలను ఆధునిక సౌకర్యాలు, హంగులతో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు శాసన మండలి ప్రాంగణాన్ని సందర్శించి, ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రాంగణాలను ఆధునిక సౌకర్యాలు, హంగులతో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు (మంగళవారం) శాసన మండలి ప్రాంగణాన్ని సందర్శించి, ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. అభివృద్ధి పనుల కోసం గుర్తించిన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రాంగణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించడంతో పాటు, ప్రజాప్రతినిధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంపైనా ప్రధానంగా చర్చించారు.
శాసన సభ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్‌తో పాటు కీలక ప్రజాప్రతినిధుల నివాస భవనాల నిర్మాణానికీ ప్రతిపాదనలను పరిశీలించారు. అలాగే శాసనసభకు అనుబంధ, పరిపాలనా భవనాల నిర్మాణంతో పాటు శాసనసభా పక్ష కార్యాలయాలు, విశ్రాంతి భవనం, క్రీడా మైదానం ఏర్పాటు వంటి ప్రతిపాదనలపై సీఎస్‌కు అధికారులు వివరించారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం, శాసనసభ ప్రాంగణాన్ని మరింత విస్తరించే అవకాశాలపైనా చర్చించారు. ప్రాంగణ విస్తరణలో భాగంగా పర్యాటక శాఖకు చెందిన భూమితో పాటు డీజీపీ కార్యాలయానికి సంబంధించిన కొంత భూమినీ శాసనసభకు బదిలీ చేసే అంశం కూడా సమీక్షకు వచ్చింది. ఆయా భూముల లభ్యత, అభివృద్ధి పనులకు వాటి వినియోగంపై అధికారులు చర్చించారు.
పచ్చదనానికి ప్రాధాన్యత..
శాసనసభ ప్రాంగణ అభివృద్ధి కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న పచ్చదనానికి ఎలాంటి విఘాతం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యావరణహిత విధానాలు, సుస్థిర అభివృద్ధి ప్రమాణాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం సూచించడంతో ఆ దిశగా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ప్రాంగణంలో పచ్చదనాన్ని కాపాడటంతో పాటు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా, పార్కింగ్ వ్యవస్థలను సమన్వయం చేయడంపై దృష్టి సారించారు. మొత్తంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని మరింత విస్తృతంగా, ఆధునికంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ కార్యరూపం దాల్చితే శాసనసభ ప్రాంగణానికి కొత్త రూపురేఖలు రానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
చనిపోయిన ఇందిరాగాంధీకి ఇంకా ఓటు హక్కు ఉంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
కేసీఆర్ హయాంలో తెలంగాణ సొత్తును కొల్లగొట్టారు.. మంత్రి పొంగులేటి ధ్వజం