Share News

ఎన్టీఆర్‌ గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతల ఫైర్

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:33 PM

ఎన్టీఆర్ వచ్చాక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ గురించి తెలియక కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ గురించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. టీడీపీ నేతల ఫైర్
TDP Telangana

హైదరాబాద్, జూన్ 3: ఎన్టీఆర్ వచ్చాక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి తెలియక కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి తొలగిస్తామని.. ఎన్టీఆర్ విగ్రహాలు కూలుస్తామంటున్నారని అన్నారు. తెలంగాణ వాళ్లు కాదని.. అంబేద్కర్, పూలే విగ్రహాలు తీసేస్తారా అని ప్రశ్నించారు. కొత్తగా పుట్టిన పార్టీ వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు ఆనాడు లేఖ ఇచ్చారని గుర్తుచేశారు.


టీడీపీ తెచ్చిన సంస్కరణల వల్లే తెలంగాణ ఇప్పుడు నంబర్ వన్‌గా ఉందని అర్వింద్ అన్నారు. కొత్తగా పెట్టిన పార్టీ వాళ్లు.. తాము ముఖ్యమంత్రి అవుతామని విగ్రహాలు తొలగిస్తామని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఎక్కడైనా మీటింగ్‌లు పెట్టుకోవచ్చని.. పోటీ చేయవచ్చన్నారు. కానీ ఇక్కడ మీటింగ్‌లు పెట్టుకోవద్దని... పెడితే అడ్డుకుంటామని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్లంతా ఒక్కటిగా ఉందామని అర్వింద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.


పవన్ ఏం తప్పుగా మాట్లాడారు: నర్సారెడ్డి

తెలంగాణ తమ వల్లనే వచ్చిందన్న కేసీఆర్ పదేళ్లు పాలన చేశారని టీడీపీ నేత నన్నూరి నర్సారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చింది తామే అన్న పార్టీ రెండున్నరేళ్ళుగా అధికారంలో ఉందన్నారు. ఈ రెండు పార్టీల పాలనపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 60-70 ఏళ్లు జరగని దోపిడీ కేసీఆర్ పాలనలో జరిగిందని ఆరోపించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతకుమించి దోపిడీ జరిగిందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం తప్పుగా మాట్లాడారని ఆయనపై విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కోసం జనసేనతో కలిసి పోటీ చేస్తామని.. మరో పార్టీతో అయినా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.


తెలంగాణ గడ్డ అభివృద్ధికి బాటలు వేసింది టీడీపీ అని నర్సారెడ్డి అన్నారు. చంద్రబాబును, టీడీపీని అప్రతిష్ఠపాలు చేసే కుట్రలు ఇక్కడ నుంచి జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, సేవా కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నాయని తెలిపారు. ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పుతున్న పార్టీని ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు ఇక్కడ మనుగడ ఉందని తెలిపారు. అడ్డుకుంటాం.. దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పొత్తుల అంశం ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని నన్నూరి నర్సారెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్

హైదరాబాద్‌‌లో నకిలీ ఐఏఎస్ ముఠా అరెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 04:46 PM