తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:10 AM
తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తన నిబద్ధత ఇటీవల మొదలైనది కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దివంగత వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానని చెప్పారు.
అమరావతి, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల తన నిబద్ధత ఇటీవల మొదలైనది కాదని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు తాను, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు, గద్దర్‌తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నట్లు తెలిపారు. దివంగత వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపానని గుర్తుచేశారు.
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అనే పునాదులపై నిర్మించబడిన ‘సామాజిక తెలంగాణ’ కోసం పిలుపునిచ్చినట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణకు తాను ఇచ్చిన మద్దతు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఆనాడు తీసుకున్న వైఖరి తెలంగాణ, ఆ ప్రాంత ప్రజల పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన మద్దతు రాజకీయపరమైనది కాదని.. అది ఒక సిద్ధాంతపరమైన విషయమని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తురాలి మృతి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
Read Latest Telangana News And Telugu News