బొగ్గు కొరతపై క్లారిటీ ఇచ్చిన సింగరేణి..
ABN , Publish Date - Jun 06 , 2026 | 06:54 PM
ప్రస్తుతం బొగ్గు నిల్వలు 26.51 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని సింగరేణి సంస్థ వివరణ ఇచ్చింది. ఇది గత పదేళ్లలో అత్యల్ప స్థాయి అని సంస్థ తెలిపింది.
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రస్తుతం బొగ్గు నిల్వలు, టెండర్ విధానాలు, ఆరోపణలపై వివరణ ఇచ్చింది. ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది. గత 10 సంవత్సరాల్లో ఇదే అత్యల్ప స్థాయి స్టాక్‌గా నమోదు అయినట్లు స్పష్టం చేసింది.
2014–2024 మధ్య సగటు బొగ్గు నిల్వలు సుమారు 50 లక్షల టన్నులుగా ఉన్నాయని, అయితే ప్రస్తుత తగ్గుదల అసాధారణం కాదని.. ఇది సాధారణ ఉత్పత్తి, రవాణా ప్రక్రియలో భాగమేనని సంస్థ తెలిపింది. వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ అవసరాల కోసం కనీసం 30 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అవసరమని కూడా వివరించింది.
ఓవర్‌బర్డెన్ పనులపై కొత్త నిబంధనలు
ఓవర్‌బర్డెన్ పనులకు టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసినట్లు సింగరేణి స్పష్టం చేసింది. సైట్‌ను ప్రత్యక్షంగా పరిశీలించకుండా కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేయడం, మధ్యలో నిలిపివేయడం వంటి సమస్యలు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
శ్రీరాంపూర్ OC-2 సహా కొన్ని ప్రాజెక్టుల్లో పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందని వివరించింది. ఈ కారణంగా మే 2025 నుంచి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదే విధానం ఇతర ప్రభుత్వ సంస్థలు అయిన NMDC, GMDC, GIPCLలో కూడా అమల్లో ఉందని ఉదాహరణగా పేర్కొంది.
ఆరోపణలపై విచారణ
మెడికల్ బోర్డు నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ACB) విచారణ కొనసాగుతోందని సంస్థ తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టులు జరిగినట్లు, సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే విజిలెన్స్ విభాగం కూడా అంతర్గత విచారణను కొనసాగిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. మొత్తం వ్యవహారంపై పూర్తి పారదర్శకతతో చర్యలు తీసుకుంటున్నామని సంస్థ స్పష్టం చేసింది.
Also Read:
నీట్ పరీక్ష భద్రతపై ప్రత్యేక దృష్టి.. సీఎస్ కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. సీఎస్ కీలక ఆదేశాలు