Share News

4000 కోట్ల పెట్టుబడికి ‘సఫ్రాన్‌’ ఆసక్తి

ABN , Publish Date - Nov 22 , 2026 | 06:38 AM

ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్‌ దిగ్గజం సఫ్రాన్‌ రాష్ట్రంలో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాజా ఆసక్తి చూపించింది. విమాన ఇంజన్లు, విడిభాగాల తయారీతో పాటు ఇతర ఏరోస్పేస్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.

4000 కోట్ల పెట్టుబడికి ‘సఫ్రాన్‌’ ఆసక్తి

  • ఏరోస్పేస్‌లో భారీ పెట్టుబడులకు ప్రతిపాదన..

  • రాష్ట్రంలో తయారీ కార్యకలాపాల విస్తరణకు సుముఖత

  • విమాన విడి భాగాల తయారీ రంగానికి మరింత ఊతం

  • ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సదస్సులో ఎంవోయూ కుదిరే అవకాశం

  • డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

  • ఫ్రాన్స్‌లోని సఫ్రాన్‌ తయారీ కేంద్రం సందర్శన

హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్‌ దిగ్గజం సఫ్రాన్‌ రాష్ట్రంలో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాజా ఆసక్తి చూపించింది. విమాన ఇంజన్లు, విడిభాగాల తయారీతో పాటు ఇతర ఏరోస్పేస్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో అత్యాధునిక విమాన విడిభాగాల తయారీ రంగానికి మరింత ఊతం లభించనుంది. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’లో దీనిపై అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా శనివారం పారిస్‌ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్‌లో ఉన్న సఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్ల తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ, అసెంబ్లింగ్‌ ప్రక్రియలను పరిశీలించారు. సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో సఫ్రాన్‌ కార్యకలాపాల విస్తరణ, కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.


హైదరాబాద్‌లో ఇప్పటికే సఫ్రాన్‌ గణనీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని, వాటిని మరింత విస్తరించేందుకు సంస్థ ఆసక్తి చూపిస్తోందని భట్టి తెలిపారు. ఏరోస్పేస్‌ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉండడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతులు మంజూరు చేసే విధానం తెలంగాణకు ఉన్న ప్రధాన బలాలని సఫ్రాన్‌ ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు. డిసెంబరులో జరిగే ఇన్వెస్ట్‌ తెలంగాణ సదస్సుకు సంస్థ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించినట్లు వెల్లడించారు. సఫ్రాన్‌ ఇప్పటికే హైదరాబాద్‌లో విమాన ఇంజన్లకు అవసరమైన రొటేటింగ్‌ పార్ట్స్‌ తయారీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ పవర్‌ తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేసింది. వీటితోపాటు లీప్‌ ఇంజన్ల నిర్వహణ, మరమ్మతులు, సమగ్ర నిర్వహణ కోసం ప్రత్యేక ఎంఆర్‌వో కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి, సఫ్రాన్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ల నుంచి తూటాల వర్షం.. కరుడుగట్టిన గ్యాంగ్‌‌స్టర్ అరెస్టు

పారిశ్రామిక విప్లవం కంటే ఏఐ విప్లవమే పెద్దది.. ఆంథ్రోపిక్ ఐపీఓపై ట్రంప్ ప్రశంసలు..

Updated Date - Nov 22 , 2026 | 06:38 AM