Share News

తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం రేవంత్

ABN , Publish Date - Jun 12 , 2026 | 06:19 PM

తెలంగాణకు వచ్చేందుకు.. వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

తెలంగాణలో పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం రేవంత్
TG CM Revanth Reddy

న్యూఢిల్లీ, జూన్12: తెలంగాణకు వచ్చేందుకు.. వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే.. పవన్‌ కల్యాణ్‌పై తమ మంత్రులు మాట్లాడారన్నారు. తనకు హిట్లర్ ఆదర్శం అని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా.. హిట్లర్‌ తమకు ఆదర్శం అని చెబుతారా? అని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానంతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని చెప్పారు.


ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో తనను ఆయనే కౌగిలించుకున్నారని .. తాను కౌగిలించుకోలేదని సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాలను ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాటిస్తున్నారని విమర్శించారు. పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కిషన్‌రెడ్డే‌ కారణమని కుండబద్దలు కొట్టారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కూడా కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారని గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రధానితో ఒక్కసారైనా మాట్లాడారా? అని కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.


గాడ్సేనే కాదు.. కిమ్‌ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి తెలిసింది ఓట్‌ చోరీ.. లేకపోతే సీట్‌ చోరీ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడిందన్నారు. మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ అప్రజాస్వామిక చర్య అని అభివర్ణించారు. ఆమె నామినేషన్‌ తిరస్కరణ అత్యంత బాధాకరమన్నారు. మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసే లేదని స్పష్టం చేశారు. మహిళా వ్యతిరేకి బీజేపీ అని సీఎం రేవంత్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 12 , 2026 | 06:32 PM