Share News

దళితులంటే చిన్నచూపు

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:08 AM

ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు దళితులంటే చిన్నచూపు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్‌గా దళితుడు ఉన్నందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు.

దళితులంటే చిన్నచూపు

  • దళిత స్పీకర్‌ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసన

  • కేసీఆర్‌ అసెంబ్లీకి రానిది దళితుడు స్పీకర్‌గా ఉన్నందుకే..

  • పొంగులేటి రాజీనామా చేయడం కాదు.. సభకు రాని కేసీఆర్‌తో చేయించండి

  • వారి మంత్రివర్గంలో నలుగురూ రావులే

  • మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు

  • దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేకపోయారు

  • హరీశ్‌ తమ్ముడు, బావమరిది బాలానగర్‌ భూదందాపై హౌస్‌ కమిటీ వేద్దామా?

  • ఎథిక్స్‌ కమిటీని నియమించి కౌశిక్‌రెడ్డి తీరుపై నిర్ణయం తీసుకోవాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు దళితులంటే చిన్నచూపు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్‌గా దళితుడు ఉన్నందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు. దళిత స్పీకర్‌ పైన కూర్చుంటే.. దొరబిడ్డనైన తాను కింద కూర్చోవడం ఏమిటని, ఎదుట నిలబడి మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వమని అడగాలా? అని కేసీఆర్‌ భావిస్తున్నారని తెలిపారు. దళిత స్పీకర్‌ సభను సమర్థంగా నడపలేరని చెప్పేందుకు రాజకీయ కుట్రలో భాగంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన చేపట్టారని ధ్వజమెత్తారు. కేటీఆర్‌, హరీశ్‌ కలిసి అసెంబ్లీ సజావుగా నడవకుండా చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆదివారం శాసనసభలో సీఎం మాట్లాడారు. తెలంగాణ సాధిస్తే.. దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్‌ చెప్పారని, దీంతో జి.వివేక్‌, కడియం శ్రీహరి, విజయ రామారావు, ఎవరో ఒకరు సీఎం అవుతారని భావించామని అన్నారు. వికారాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌ను సీఎంను చేస్తానని నమ్మించారని చెప్పారు. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక.. దళితులకు పరిపాలన చేతకాదని, తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలంటే దొర మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ అన్నారని తెలిపారు. దళితుడు సీఎం కావడానికి వీల్లేదంటూ అత్యంత అవమానకరంగా నట్టేట ముంచారని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలోనూ దళిత వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని విమర్శించారు. దళిత వర్గానికి చెందిన భట్టివిక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్‌ ఓర్వలేకపోయారని సీఎం రేవంత్‌ అన్నారు. వివక్ష ప్రదర్శించి కాంగ్రెస్‌కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌‌లో చేర్చుకున్నారని తెలిపారు. తద్వారా భట్టిని ప్రతిపక్ష నేతగా తొలగించి పైశాచికానందం పొందారని మండిపడ్డారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, సభలోకి రానివ్వకపోయినా ఎదుర్కొని.. భట్టివిక్రమార్క పాదయాత్ర చేపట్టి ప్రజా జీవితంలో రాణించారని చెప్పారు.


అందువల్లే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఆర్థికమంత్రి హోదా కూడా దక్కిందని అన్నారు. దళితులను చిన్నచూపు చూసే కేసీఆర్‌కు కనువిప్పు కలగాలనే ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టామని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ మంత్రి వర్గంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, దయాకర్‌రావు నలుగురూ రావులే ఉంటే.. తమ ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా భట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహ, జి.వివేక్‌, అడ్లూరి లక్షణ్‌, సీతక్క ఉన్నారని రేవంత్‌ అన్నారు. ‘‘ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. నాటి ఆర్థిక మంత్రి అవమానించేలా మాట్లాడటం, నీకు చేతకాదు.. అవగాహన లేదు.. నువ్వు నడపలేవు అనడం ఏంటి? దొరలు మాత్రమే బడ్జెట్‌ పెట్టగలరని భట్టిని టార్గెట్‌ చేసి మాట్లాడటం తెలంగాణ సమాజానికి మంచిదా?’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. 140 ఏళ్ల కింద ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ద్వారా దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకుందని, అద్భుత రాజ్యాంగాన్ని దళిత వర్గానికి చెందిన అంబేద్కర్‌ ద్వారా తీసుకొచ్చార ని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించారని తెలిపారు. ఇప్పుడు దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించుకుందని చెప్పారు.

కేసీఆర్‌తో రాజీనామా చేయించండి..

అక్రమ మైనింగ్‌లో పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కుటుంబం ఉన్నా, రేవంత్‌రెడ్డి కుటుంబం ఉన్నా.. ఆధారాలను సీబీసీఐడీకి ఇవ్వాలని, వారు విచారణ జరిపి చర్యలు చేపడతారని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలంటూ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. మొదట మీకు సిగ్గుంటే.. సభకు రాని చంద్రశేఖర్‌రావుతో రాజీనామా చేయించాలి. కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయన రాజీనామా చెయ్యడట. జీతం వాపస్‌ ఇయ్యడట. కానీ, రోజూ 18 గంటలు పనిచేస్తూ నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించి లక్షలాది మంది గిరిజన, దళిత, ఆదివాసీలకు ఇచ్చి శ్రీనివా్‌సరెడ్డి రాజీనామా చెయ్యాలా? మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలా? మీ తాతలు దిగొచ్చినా అది జరగదు. ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. కానీ, మేం చెప్పినట్లే ప్రభుత్వం నడవాలన్న అహంకారం మంచిది కాదు’’ అని సీఎం హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని కొనసాగించిన బీఆర్‌ఎస్‌ వారు.. సభలో ఆ అంశంపై ఉపన్యాసాలివ్వడం హాస్యాస్పదమని రేవంత్‌ అన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లారని గుర్తు చేశారు. పక్క పార్టీ సింబల్‌తో గెలిచిన వారిని తీసుకొని మంత్రులను చేసి.. ఇప్పుడు వాళ్లే ఇక్కడకు వచ్చి పార్టీ ఫిరాయింపుల గురించి.. పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంటే సిగ్గనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 2018 తర్వాత కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలనూ తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారని, అప్పటి మంత్రులే ఈ రోజు సీతక్కను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘దుష్ట సంస్కృతికి జాతి పితామహులు మీరు. అలాంటి వాళ్లు.. వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు’’ అని రేవంత్‌ ఎద్దేవా చేశారు.


బాలానగర్‌ భూములపై హౌస్‌ కమిటీ వేద్దామా..?

హరీశ్‌రావు తమ్ముడు, మామ, బావమరిది.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ పరిధిలో ప్రైవేటు కంపెనీని బెదిరించి వందల ఎకరాలు బదలాయించుకున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. దీనిపై హౌస్‌ కమిటీ వేయడానికి సిద్ధమేనన్నారు. దీనికి హరీశ్‌రావు, కేటీఆర్‌ ఒప్పుకొంటే వెంటనే హౌస్‌ కమిటీ వేస్తామన్నారు. హరీశ్‌రావు నిజాయితీపరుడని కేటీఆర్‌, వెంకటరమణారెడ్డి నమ్మితే హౌస్‌ కమిటీకి ఒప్పుకోవాలన్నారు. పరిశ్రమల యజమానులను బెదిరించి.. ధరణిని అడ్డు పెట్టుకుని.. వందల ఎకరాలు స్వాహా చేశారని, ఇప్పుడు బకెట్లో బురద తెచ్చి మంత్రిపై చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుటుంబ తగాదాల వల్లే సభను అడ్డుకునే ప్రయత్నం..!

కేసీఆర్‌ కుటుంబంలో తగాదాల వల్లే సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘సభలోనే విచారణకు ఆదేశించాక.. నువ్వు చేసిన పనికి, నీ బ్లాక్‌మెయిల్‌ కోసం నేను కూడా ఇరుక్కున్నానంటూ కేటీఆర్‌ హరీశ్‌రావుపై దాడి చేయడంతో ఈ రోజు సభను జరగకుండా చేయాలని చూస్తున్నారు. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రభుత్వానికి సహకరించండి. మీ వద్ద ఉన్న సమాచారాన్ని సీబీసీఐడీ అధికారులకు ఇవ్వండి’’ అని సీఎం అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌ అనుచరులు ఎంతో మంది అక్రమంగా భూములను ఆక్రమించుకుంటే.. అక్కడి కలెక్టర్‌ అందరినీ జైలుకు పంపారని తెలిపారు. ఆ భూములను కాపాడుకునేందుకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేందుకు.. తమ మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తామంటే ఊరుకోబోమన్నారు. ‘‘మీ పప్పులు ఉడకవు. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇక్కడ ఉన్నది రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క. మీ ఉడత ఊపులకు భయపడే కాలం చెల్లిపోయింది’’ అని హెచ్చరించారు. రాజకీయంగా ఎటువంటి వ్యతిరేకత ఉన్నా.. కడియం శ్రీహరి నిబద్ధత, నిజాయితీ కలిగిన సీనియర్‌ నాయకుడు అని అన్నారు. కేసీఆర్‌తో సమానమైన కడియంను అవమానించేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడు అనుచితంగా వ్యవహరిస్తే.. కేటీఆర్‌, హరీశ్‌రావు ఖండించరా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్‌రెడ్డి సభలో కడియం శ్రీహరి పట్ల ప్రదర్శించిన హావభావాలు, అవమానకర తీరుపై స్పందించి.. సభలో సత్సంప్రదాయం అమలయ్యేలా అసెంబ్లీ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్‌రావు కోరినట్లుగా తక్షణమే ఎథిక్స్‌ కమిటీని నియమించి.. కౌశిక్‌రెడ్డి తీరుపై నిర్ణయం తీసుకోవాలన్నారు.


సీబీఐ విచారణ ఢిల్లీలో తొక్కిపెట్టారు

బీజేపీ సభ్యులకుసూచనలివ్వడం అలవాటుగా మారిందని సీఎం రేవంత్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ కోరుతున్నట్లుగా హౌస్‌ కమిటీ వేయాలని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించడంపై సీఎం స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ నాయకులకు ఏటీఎంలా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పలు సందర్భాల్లో ఆరోపించారని గుర్తు చేశారు. ‘‘కేసీఆర్‌ను లోపల వేయడం మీ వల్ల కాదు.. కాంగ్రెస్‌ వాళ్లు జైల్లో పెట్టలేరు.. కాళేశ్వరం కేసును సీబీఐకి బదిలీ చేయండి.. 48 గంటల్లో జైల్లో పెడతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబితే.. ఆయన మాటలు నమ్మి.. ఏదో చేస్తారని సీబీఐ విచారణకు అప్పగించాం. కానీ, ఎనిమిది నెలలు గడిచినా.. ఏం జరిగిందో మీరు చూస్తున్నారు కదా! బీజేపీ ఎమ్మెల్యేలు ముందుగా కాళేశ్వరం విచారణ సంగతి తేల్చాలి. సీబీఐ విచారణ జరగకుండా ఢిల్లీలో తొక్కిపెట్టి.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటై.. ఓట్లు, సీట్లు పంచుకుంటున్నాయి. కేసీఆర్‌ను, హరీశ్‌రావును జైల్లో పెట్టాక.. మాకు సలహాలు, సూచనలు చేస్తే వింటాం’’ అని అన్నారు. 2014 నుంచి రాఘవ సంస్థపై ఆరోపణల వరకు సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని చెప్పారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులు అడిగిన పనులు చేయలేదనే కారణంతోనే బ్లాక్‌మెయిల్‌కు దిగారని ఆరోపించారు.

అక్రమాలను నియంత్రించి ఆదాయం పెంచే ప్రయత్నం

ఖనిజ సంపదలో జరుగుతున్న అక్రమాలు, వస్తున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇసుక, క్రషర్స్‌, గ్రానైట్స్‌ విషయంలో అక్రమాలను నియంత్రించి.. పారదర్శకంగా ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే నిబద్ధత కలిగిన మంత్రికి, అధికారులకు బాధ్యత అప్పగించామన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ క్రషర్‌ను సందర్శించి.. ఆ సంస్థ ద్వారా నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చి చిత్తశుద్ధితో ప్రభుత్వానికి ఆదాయం రాబట్టామని తెలిపారు. తాము ఈ నోటీస్‌ ఇస్తే.. దానిని పట్టుకొని వారే ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడినట్లు బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో నటన చేస్తున్నారని విమర్శించారు. ‘‘బీఆర్‌ఎస్‌ హయాంలో ఇల్లీగల్‌ సేల్‌, ఆక్యుపేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ల్యాండ్‌, హౌస్‌ కమిటీ ఆన్‌ ఎంక్వైరీ ఇన్‌టు వక్ఫ్‌ ప్రాపర్టీస్‌, హౌస్‌ కమిటీ ఆన్‌ ఇర్రెగ్యులారిటీ ఆఫ్‌ హౌసింగ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌... ఇలా మూడు హౌస్‌ కమిటీలు వేశారు. వీటిని అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌ చేసి వారందరి దగ్గర ఆస్తులు కొల్లగొట్టడమే కాకుండా.. రాజకీయంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు ఉపయోగించారు. ఇప్పుడు కూడా హౌస్‌కమిటీ వేస్తే.. వాళ్ల పార్టీ నుంచి ఒకరిద్దరు సభ్యులు వచ్చి వారు దోచుకున్న భూములను సక్రమం చేసుకోవాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు కోరుతున్నట్లు హౌస్‌ కమిటీ వేసినా.. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏమేం చేయాలన్నది సభాపతికి నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సింది దర్యాప్తు సంస్థలే. 2014 జూన్‌ నుంచి ఇప్పటివరకు ఇసుక, మైనింగ్‌, ఇతర ఖనిజ సంపదకు సంబందించి సీబీసీఐడీ విచారణ చేపట్టి చర్యలు చేపడతాం. నిజాయితీ కలిగిన అధికారులను సీబీసీఐడీ విచారణకు నియమించి నిజం నిగ్గు తేల్చుతాం. రాష్ట్రంలో న్యాయం జరగదని మీరు భావిస్తే.. కేంద్రం పరిధిలోని సీబీఐ విచారణ కావాలంటే అక్కడికే పంపిస్తాం’’ అని రేవంత్‌ వివరించారు.

Updated Date - Mar 30 , 2026 | 05:55 AM