తాటి చెట్టుకాదు.. కల్పవృక్షం
ABN , Publish Date - May 20 , 2026 | 04:16 AM
తాటి చెట్టు అంటే కేవలం కల్లు గీయడానికే పరిమితం కాదని, అది కనకవర్షం కురిపించే ఒక కల్పవృక్షమని అంటున్నారు ఎక్స్‌పీరియం చైర్మన్ రామ్‌దేవ్‌రావ్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లుమీద ఆయన పెంచుకున్న అభిమానంతో..
ఎక్సైజ్ నిబంధనలు మార్చాలి.. కల్లు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి
కర్ణాటక తరహాలో టాడీ బార్లు ఏర్పాటు చేయాలి
24న టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం
కల్లు తాగితే హాని ఉండదని అవగాహన కల్పిస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌పీరియం చైర్మన్ రామ్‌దేవ్‌రావ్
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): తాటి చెట్టు అంటే కేవలం కల్లు గీయడానికే పరిమితం కాదని, అది కనకవర్షం కురిపించే ఒక కల్పవృక్షమని అంటున్నారు ఎక్స్‌పీరియం చైర్మన్ రామ్‌దేవ్‌రావ్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లుమీద ఆయన పెంచుకున్న అభిమానంతో.. దేశ విదేశాలకు చెందిన 270 రకాలైన తాటి చెట్లు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం రోడ్డులో ఉన్న తన ఎక్స్‌పీరియం పార్క్‌లో సాగుచేశారు. నీరా, కల్లు ప్రాముఖ్యత గురించి ఆయన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఏయే దేశాల్లో కల్లుకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందనేది ఆయన వివరిస్తూ.. రాష్ట్రంలో కల్లు, నీరాను బీర్, వైన్, విస్కీ మాదిరిగానే బార్లు, హోటళ్లలో విక్రయించేలా ఎక్సైజ్ నిబంధనలు మార్చాలని, పాల మాదిరిగానే కల్లు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలని అంటున్నారు. దీంతో గీత కార్మికుల ఆదాయంతో పాటు ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందన్నారు. ఈ నెల 24న తన ఎక్స్‌పీరియం పార్కులో ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియం-2026 పేరుతో తాటికల్లు మేళా నిర్వహించబోతున్నారు. రామ్‌దేవ్‌రావ్ అనుభవాలు, ఆలోచనలు ఆయన మాటల్లోనే..
తాటి చెట్లు, కల్లు, నీరా రంగంపై ఆసక్తి ఎలా పెరిగింది.? దీని వెనుక ఉన్న మీ వ్యక్తిగత ప్రేరణ ఏంటి?
నా చిన్నప్పుడు వరంగల్ జిల్లాలో మాకు 100 ఎకరాలు భూమి ఉండేది. అందులో ఏ చెట్టునూ కొట్టకూడదని వదిలేయడంతో వేల చెట్లు పెరిగాయి. దీంతో అక్కడ పెరిగిన తాటి చెట్ల నుంచి రెగ్యులర్‌గా మాకు కల్లు వచ్చేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లు తాగి పెరిగాను. నాకు వ్యక్తిగతంగా కల్లుపై అభిమానం పెరిగింది. నా చదువు అయిపోయాక వ్యాపారం చేశాను. చిన్నప్పటి నుంచి చెట్లంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే 150 ఎకరాల్లో ఎక్స్‌పీరియం మొదలుపెట్టాను. తాటిచెట్లపై ఉన్న అభిమానంతో వేరే దేశానికి వెళ్లినప్పుడు రకరకాలైన తాటి చెట్ల గురించి స్టడీ చేసేవాడిని. దీంతో 270 రకాలైన తాటి చెట్లు తెచ్చిపెట్టాను. మాకు ఒక వాట్పాస్ గ్రూపు ఉండేది. దీంట్లో కల్లు తయారీలో అపోహలు, కల్లు తాగేవాళ్లపై, గీత కార్మికులపై చిన్నచూపు ఉండేది. కల్లుపై ఉన్న ఇలాంటి వ్యతిరేక భావనలకు చెక్ పెట్టాలనుకున్నాం. మద్యంలో మల్టీనేషనల్ కంపెనీల దోపిడీ గురించి చర్చించేవాళ్లం. అందుకే కల్లు, నీరా తయారీలో మార్పులు తీసుకరావాల్సిన అవసరం ఉందని గుర్తించాం.
తాటి చెట్లపై పరిశోధన కోసం అనేక దేశాలు తిరిగారు. అక్కడ మీరు గమనించిన ప్రత్యేకతలేంటి? వాటికి మన స్థానిక నేలలు, వాతావరణం అనుకూలిస్తాయా?
ప్రపంచంలో చిత్ర విచిత్రమైన తాటి చెట్లు ఉన్నాయి. నేను వ్యాపార రీత్యా 85 దేశాలు తిరిగాను. నాకు తాటిచెట్టుపై ఉన్న అభిమానంతో వాటిపై ఎక్కువగా దృష్టి సారించాను. ఉదాహరణకు.. కాంబోడియా అనే దేశంలో నేషనల్ ట్రీ తాటిచెట్టు. అక్కడ కల్లును రకరకాలుగా ప్రాసెసింగ్ చేస్తారు. మన దగ్గర పాల ప్రాసెసింగ్ యూనిట్ల మాదిరిగానే.. అక్కడ కల్లు ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. కల్లుతోపాటు చాక్లెట్లు, బెల్లం, చక్కెర తయారు చేస్తారు. ప్రాసెసింగ్ కల్లును బార్లలో సర్వ్ చేస్తారు. అమెరికాలో రూ.3500కు 750 మిల్లీ లీటర్ల కల్లు. అంటే.. మన బ్లాక్ లేబుల్ టైప్ అన్నట్లు. ఇక్కడ రూ.100కు లీటర్ కల్లు. దీనిని నిర్లక్ష్యంగా చీప్‌గా చూస్తున్నాం. సీషెల్స్ అనే దేశంలో ఐదు ఎకరాల్లో (హైలెండ్) ఒక రకమైన తాటి చెట్టు. ఆ చెట్టు గింజ ఒక్కటి 45 కిలోలు ఉంటుంది. ఆ గింజలను ఎగుమతి చేయడాన్ని ఆ దేశం 1975లో నిషేధించింది. ఏదో ఒక రకంగా అక్కడి నుంచి రూ.25 లక్షలకు ఐదు గింజలు తెచ్చాను. సౌత్ అమెరికా, మెక్సికో, చైనాలో ఇలా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన తాటి చెట్లు ఉంటాయి. నాకు వ్యక్తిగత అభిమానంతో అమెరికా, అర్జెంటీనా, స్పెయిన్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా వంటి దాదాపు 80 దేశాల నుంచి 270 రకాలైన తాటి చెట్లను సేకరించాను. తాటిలో 1200 రకాలున్నాయి. అన్ని రకాలు ఇక్కడ తట్టుకోలేవు. అన్ని పరిశోధించాకే ఇక్కడ సాగు చేశాను.
మత్తు కలిగించేది ఏదైనా ఆరోగ్యానికి హానికరమే అనే భావన సమాజంలో ఉంది. మరి నీరా, కల్లు అనేది నిజంగా ఆరోగ్యానికి మంచిదా?
ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ, బీర్లు, వైన్స్, విస్కీలు.. ఇలా ఏ బ్రాండ్‌లోనైనా ఆల్కహాల్ ఉండటం వల్ల అవి ఆరోగ్యానికి హానికరం. వీటిలో కెమికల్స్ కలుస్తాయి. కల్లు అనేది చెట్టు నుంచి సహజంగా వచ్చేది. తొలుత వచ్చేది నీరా. మెల్లగా కల్లులా మారుతుంది. ఆలస్యమైన కొద్దీ కల్లులో కొంచెం ఆల్కహాల్ శాతం పెరుగుతుంది. అదే చెట్టునుంచి తీయగానే తాగితే కొంచెమే ఆల్కహాల్ ఉంటుంది. దీంతోపాటు చాలా మేలు చేసే సుగుణాలు కూడా ఉన్నాయి. అందరినీ తాగమని చెప్పట్లేదు. అలా అని మద్యం సేవించని కొత్తవాళ్లను తాగమని చెప్పట్లేదు. అలాంటి ఉద్దేశమే నాకు లేదు. ఇప్పటికే వైన్, లిక్కర్, బీర్ తాగుతున్న వాళ్లను అవి మానేసి కల్లు, నీరా తాగమని చెబుతున్నా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్సైజ్ ఆదాయమే మేజర్. అయితే.. ఈ ఆదాయంలో ఎక్కువగా విదేశీ బ్రాండ్ల కంపెనీలకు వెళుతోంది. అదే కల్లు ఆదాయం పెరిగితే.. గీత కార్మికులు, స్థానికులు ఆ ఆదాయంతో బాగుపడతారు. ఈ సంస్కృతిని మార్చాలనేది నా ఉద్దేశం.
కల్లును స్టార్ హోటళ్లు, బార్లలో వైన్, బీర్ మాదిరిగానే విక్రయించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మీరు కోరారు. ఇది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా? ఎక్సైజ్ పరమైన ఇబ్బందులు రావా? తాటిచెట్టు నుంచి తీసిన కొద్దిసేపటికే పులిసిపోతుంది. నాణ్యత చెడిపోకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న సాంకేతికత ఏంటి?
అదంతా ప్రభుత్వం చేతిలో ఉంది. ఎక్సైజ్ శాఖలో రూల్స్ అన్నీ విధించేది ప్రభుత్వమే. అవన్నీ మనం రాసుకున్న నిబంధనలే. ఆ ‘ఎక్సైజ్ లా’లో చిన్న సవరణ చేయాలి. కల్లును కూడా ఒక మంచి పద్ధతిలో ప్రాసెస్ చేసే విధంగా. ఎలా పడితే అలా కాకుండా.. దానికి కూడా ఒక ట్యాక్స్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ప్రభత్వానికి కూడా రెవెన్యూ రావాలి. లిక్కర్ బ్రాండ్ కంపెనీలకు ఆ షేర్ వెళ్లే బదులు ఆ ఆదాయం మన రైతులు, గీతకార్మికులకు ఎందుకు రాకూడదు అనేది నా ప్రశ్న. కేరళలో కొబ్బరి కల్లు పాపులర్. కర్ణాటకలో రెండు మూడేళ్ల క్రితమే టాడీ బార్లు ఏర్పాటు చేశారు. మన దగ్గర కూడా అలా ఉండాలి. వేలాది కుటుంబాలు కల్లుపై ఆధారపడ్డాయి. ఇంకా చెట్టుకిందనే గీత కార్మికుడు కల్లు అమ్ముకునే నిబంధన సడలించాలి. ఆంధ్రప్రదేశ్‌లో వేల సంఖ్యలో తాటిచెట్లున్నా.. అక్కడ కల్లుతీసే సంస్కృతి లేదు. మనదగ్గర ఉన్న కల్చర్‌ను కొనసాగించమని చెబుతున్నాం. ప్రతి బార్‌లో బీర్, లిక్కర్‌తోపాటు కల్లు కూడా సర్వ్ చేయమని చెబుతున్నాం. ప్రస్తుతానికి కల్లు పులిసిపోకుండా నిల్వ చేయడానికి సాంకేతికపరంగా చాలా అందుబాటులోకి వచ్చాయి. చెట్టు ఎక్కడానికి కూడా చాలా టెక్నిక్స్, యంత్రాలు ఎలాగైతే అందుబాటులోకి వచ్చాయో.. అలాగే క్వాలిటీ మెయిన్‌టెయిన్ చేయడానికి చాలా ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. పాల మాదిరిగానే ప్రాసెసింగ్ చేసి 15 రోజుల వరకు స్టోర్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంది.
ఈ నెల 24న ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియం-2026’ నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఫెస్టివల్ ద్వారా మీరివ్వాలనుకుంటున్న సందేశం ఏంటి?
వాస్తవానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే.. సినిమా ద్వారా ఇవ్వొచ్చు. అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా చేస్తే యంగ్ జనరేషన్ మైండ్‌లోకి వెళుతుంది. మ్యూజికల్ ఫెస్టివల్ అనేది రెగ్యులర్‌గా జరుగుతున్నవే. ఇటీవల జరిగిన వాటిలో అదే బీర్లు, అదే విస్కీలు సర్వ్ చేస్తున్నారు. దానికి బదులు మేము మ్యూజికల్ ఫెస్టివల్ పెట్టి.. అందులోనే నీరా, కల్లు సర్వ్ చేద్దాం అనుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి కల్లు తాగి పెరిగిన నేను.. అందులోని మంచిపై అవగాహన తీసుకొద్దామనుకుంటున్నాను. వాస్తవానికి కల్లు తాగితే మనకు హాని జరగదనే ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఈ మధ్య వచ్చే సర్వేల్లో చూస్తే.. కూల్‌డ్రింక్స్ అమ్మకాలు తగ్గాయి. నాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతున్నవారి సంఖ్య ఎక్కువైంది. కొవిడ్ తర్వాత ఆరోగ్యం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఏది తాగాలి? ఏది తినాలి? అని. ఈ అంశాలపై కొత్త జనరేషన్‌కు చాలా నాలెడ్జ్ ఉంది. కల్లు, నీరా తాగితే హాని ఉండదని వారికి తెలుసు. హైజీనిక్ వేలో ప్రొడక్ట్ సర్వ్ చేస్తే తప్పకుండా తీసుకుంటారు.