Share News

‘రాజ్యసభ’ ఏకగ్రీవమే!

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:48 AM

తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

‘రాజ్యసభ’ ఏకగ్రీవమే!

  • రెండు స్థానాలకు ముగ్గురి నామినేషన్‌లు

  • కాంగ్రెస్‌ తరఫున సింఘ్వి, వేం నరేందర్‌ రెడ్డి

  • స్వతంత్ర అభ్యర్ధిగా సాయి అనే వ్యక్తి నామినేషన్‌

  • ఎమ్మెల్యేల సంతకాలు లేనందున తిరస్కరణ!

  • రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

  • పట్నాలో అమిత్‌ షా సమక్షంలో దాఖలు

  • 16న ఫలితాల తర్వాత నితీశ్‌ రాజీనామా

  • మేలో కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ

  • నితీశ్‌కు కేంద్ర పదవిపై రాజకీయ వర్గాల్లో చర్చ

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఏప్రిల్‌లో ఖాళీ కాబోయే రెండు రాజ్యసభ స్థానాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్‌ తరఫున తెలంగాణ నుంచి అభిషేక్‌ మను సింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో ఏర్పాటుచేసిన రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం.. రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి వీరు తమ నామినేషన్‌ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, నల్గొండ ఎంపీ రఘువీర్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు, ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అభిషేక్‌ మూడు సెట్లు, నరేందర్‌రెడ్డి నాలుగు సెట్ల చొప్పున నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందించారు. కాగా.. సాయి అనే వ్యక్తి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో రెండు రాజ్యసభ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా సాయిని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో.. శుక్రవారం స్ర్కూటినీ దశలోనే ఆ నామినేషన్‌ తిరస్కరణకు గురవనుంది. మరే ఇతర పార్టీ నుంచి ఈ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో వేం నరేందర్‌ రెడ్డి, సింఘ్వీలే ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పోటీ ఉంటే మార్చి 16న ఎన్నిక జరిగేది. కానీ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీలు పోటీలో లేకపోవడంతో ఉపసంహరణ గడువు నాడే.. అంటే మార్చి 9నే, ఉపసంహరణ ప్రక్రియ సమయం పూర్తయిన తరువాత.. ఎన్నికైన అభ్యర్థులను ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. కాగా.. పార్టీ అధినాయకత్వం సలహా, సూచనల మేరకు సరైన ఇద్దరు సీనియర్‌ నాయకులను రాజ్యసభఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు ఎంపిక చేశామని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ తెలిపారు. నామినేషన్లు వేసిన సింఘ్వీ, వేం నరేందర్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఎంపీలుగా .. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వారిద్దరూ కృషి చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.


సంతోషంగా ఉంది: సింఘ్వీ

రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం కంటే కూడా.. గాంధీ భవన్‌కు రావడం సంతోషంగా ఉందని అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. నామినేషన్‌ ప్రక్రియ అనంతరం ఆయన గాంధీ భవన్‌కు వెళ్లారు. ‘‘పార్టీకి చిహ్నం గాంధీ భవన్‌. పార్టీ లేకుండా ప్రభుత్వం లేదు. అలాంటి పార్టీ ఆఫీసుకు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

నిధుల కోసం పోరాడుతా: వేం

రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర నేతలకు వేం నరేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లూ ఎలా పనిచేశానో, భవిష్యత్‌లోనూ అలాగే పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం రాజ్యసభలో పోరాడుతానన్నారు.

3.jpg2.jpg

Updated Date - Mar 06 , 2026 | 03:48 AM