Share News

కేంద్రం, ఎన్నికల సంఘం, అదానీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:30 PM

హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ 2026 ముగింపు వేడుకలో రాహుల్ గాంధీ కేంద్రం, ఎన్నికల సంఘం, అదానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 14 కోట్ల ఓట్ల తొలగింపు, దేశ వనరుల దుర్వినియోగం మీద ఆరోపణలు చేశారు.

కేంద్రం, ఎన్నికల సంఘం, అదానీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
Rahul Gandhi Bharat Summit

హైదరాబాద్, నవంబర్ 14: హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు ‘భారత్ సమ్మిట్ 2026’ ముగింపు కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. 2014 తర్వాత దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, ఎన్నికల వ్యవస్థ, ఆర్థిక విధానాలపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ దేశంలో జరుగుతోన్న పలు అంశాల్ని స్పృశించారు.

2014లో దేశంలో జరిగిన ఎన్నికలు అంతకుముందు జరిగిన ఎన్నికలకంటే పూర్తిగా భిన్నమైనవని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ ఎన్నికల సమయంలో మిలియన్ల కొద్దీ డబ్బు రాజకీయాల్లోకి ప్రవహించిందని, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేసిందని అన్నారు. దేశంలో విపరీతమైన నగదు ప్రవాహం (లిక్విడిటీ) కారణంగా రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2024 ఎన్నికల సమయంలో ఏకంగా 14 కోట్ల మంది ఓటర్లు కాదని ఎన్నికల సంఘం (EC) పేర్కొందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అంత పెద్ద మొత్తంలో ఓట్లు తొలగించి ఎన్నికలు జరిపితే, వాటిని అసలు ఎన్నికలు అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మాత్రమే దేశాన్ని ఆక్రమిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని కీలకమైన పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గనులు (మైన్స్) అన్నీ అదానీ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థలు వారి చేతుల్లోనే బందీ అయ్యాయని, ప్రతిపక్షంగా తాము ఏదైనా చేద్దామన్నా వ్యవస్థల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థలు సహకరించకపోయినా తాము నిరాశ చెందకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లగలిగామని రాహుల్ తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన ‘భారత్ జోడో’ పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నామని, ఆ ప్రయాణంలో మమ్మల్ని మేము మరింతగా తెలుసుకోగలిగామని చెప్పారు. రాజకీయాల్లో హింస, ద్వేషం, కోపం ఎన్నటికీ పనిచేయవని.. కేవలం ప్రేమ, అభిమానం, అహింస, సత్యం మాత్రమే ఎప్పటికీ గెలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలకు కట్టుబడి, సత్యం, అహింసా మార్గంలోనే తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. (Rahul Gandhi Bharat Summit)


ఈ వార్తలనూ చదవండి:

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..

Updated Date - Nov 14 , 2026 | 06:32 PM