Share News

రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. SIRపై పోరాటం ఆపేది లేదని స్పష్టం..

ABN , Publish Date - Oct 06 , 2026 | 09:22 PM

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. SIRపై పోరాటం ఆపేది లేదని స్పష్టం..
CM Revanth Reddy

హైదరాబాద్: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అహింసాయుతంగా ఉద్యమిస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరెస్టులు, జైళ్లు, లాఠీఛార్జీలు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు. అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ తప్పులపై కాంగ్రెస్ పోరాటం ఆపదని రేవంత్ స్పష్టం చేశారు.


ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో తప్పిదాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ విశ్రమించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాగా, సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి మంగళవారం పార్లమెంట్ స్ట్రీట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్ చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కూటమికి చెందిన దాదాపు 300 మంది ఎంపీలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున మార్చ్ చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈసీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.


అయితే, కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బారికేడ్లు ఎక్కి మరీ రాహుల్ గాంధీ నిరసన తెలిపారు. వాటిని తొలగించుకుని మరీ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో రాహుల్ సహా కాంగ్రెస్ అగ్ర నాయకులు ఎంపీ ప్రియాంక గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నేతలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేశ రాజధానిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Updated Date - Oct 06 , 2026 | 09:30 PM