Share News

నీళ్లను పీల్చేసే ‘పోరస్‌’!

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:41 AM

రోడ్ల మీద పడ్డ చినుకులు పడ్డట్టుగానే భూమిలోకి ఇంకిపోతే? ఈ సాంకేతికతతో కొన్ని దేశాల్లో ఇప్పటికే అంతర్గత రోడ్లు నిర్మించేశారు!

నీళ్లను పీల్చేసే ‘పోరస్‌’!

  • ఫుట్‌పాత్‌లు, పాత్‌వేలు ఇలా నిర్మిస్తే మేలు

  • పడ్డ వర్షపు నీరు నేరుగా భూమిలోకే

  • భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోడ్ల మీద పడ్డ చినుకులు పడ్డట్టుగానే భూమిలోకి ఇంకిపోతే? ఈ సాంకేతికతతో కొన్ని దేశాల్లో ఇప్పటికే అంతర్గత రోడ్లు నిర్మించేశారు! వీటిని పోరస్‌ లేదా పర్మేబుల్‌ రోడ్లు అంటారు. నిర్వహణ పరంగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో భారీ రోడ్ల మాట అటుంచి.. పక్కన ఫుట్‌పాత్‌లు, పార్కులు, చెరువుల పక్కన పాత్‌వేలు, గేటెడ్‌ కమ్యూనిటీల పరిధిలో, హోటళ్ల ప్రాంగణాల్లో ఈ పోరస్‌ రోడ్లను ఏర్పాటు చేస్తే మేలని.. ప్రత్యేకించి కాంక్రీటు జంగిల్‌గా మారి, నీళ్లు ఇంకేందుకు స్థలం లేని హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే భూగర్భజలాలు పెరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ పోరస్‌ రోడ్లు అంటే ఏమిటి? సాధారణ బీటీ, సీసీ రోడ్లపై వరద నీరు నిలుస్తుంది. లేదంటే పక్కకు పారుతుంది.


ఈ పోరస్‌ పేవ్‌మెంట్లు అలా కాదు. వర్షపు నీరు పడింది పడినట్లుగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇందుకు ప్రత్యేకంగా సన్నని ఇసుక, చిన్న కంకర మిశ్రమం, ప్రత్యేక రసాయనం కలిపిన నీళ్లతో ఈ పేవ్‌మెంట్లను తయారు చేస్తారు. ఇలా నిర్మించిన పేవ్‌మెంట్లపై సూక్ష్మ రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాల ద్వారానే వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇళ్ల ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాల్లో పోరస్‌ పేవ్‌మెంట్ల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చునని ఐఆర్‌సీ సదస్సు నేపథ్యంలో ఓ స్టాల్‌ ప్రతినిధి శశాంక్‌ తెలిపారు. సాధారణ పాత్‌వేలతో పోలిస్తే పోరస్‌ పేవ్‌మెంట్లు 12 నుంచి 15 యేళ్లు మన్నికంగా ఉంటాయని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 06:41 AM