Share News

అమిత్ షా.. తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని?: మంత్రి పొన్నం సూటి ప్రశ్న

ABN , Publish Date - Nov 02 , 2026 | 08:18 PM

హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమైందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్‌పై అనేక ఆరోపణలు చేసిన అమిత్ షా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

అమిత్ షా.. తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని?: మంత్రి పొన్నం సూటి ప్రశ్న
Minister Ponnam Prabhakar

హైదరాబాద్: నగరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమైందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్‌పై అనేక ఆరోపణలు చేసిన అమిత్ షా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని, రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న పన్నులెన్నో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తాము చర్చకు సిద్ధమని, బీజేపీ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు నెలవారీ పింఛన్లు, ఉచిత విద్యుత్, ప్రతి ఇంటికి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించారు. పెట్రోల్ ధరను రూ.50కి తగ్గిస్తామన్న హామీ గుర్తులేదా? అంటూ నిలదీశారు.


ఈ సందర్భంగా తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు దృష్ట్యా కేంద్రం తక్షణమే సహాయం చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. దేశంలో 12 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిందని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. విదేశీయుల ఓట్లు తొలగించామని బీజేపీ నేతలు చెబుతున్నారని, అయితే ఎంతమందిని దేశం నుంచి పంపించారో చెప్పాలని అమిత్ షాను డిమాండ్ చేశారు. చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి పొన్నం సవాల్ విసిరారు.


అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లను తొలగించడంపైనే కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల నుంచే ఓట్ల తొలగింపు ఫారాల పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పాలనలో అంబానీ, అదానీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో మోదీ, అమిత్ షా ట్యాక్స్ నడుస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా

తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా

Updated Date - Nov 02 , 2026 | 08:24 PM