ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:29 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరపాటు ప్రవీణ్‌ను సిట్ అధికారులు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సిట్ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరపాటు ప్రవీణ్‌ను సిట్ అధికారులు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సిట్ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారించారు. విచారణకు ముందు సిట్ కార్యాలయం ఎదురుగా ఉన్న అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు చికోటి ప్రవీణ్. సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. 'ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. మా ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలను విన్నారు. ఊహించిన దానికన్నా ఘోరంగా ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో నాకు అర్థమైంది. నేను 200మంది ఫోన్లు మాత్రమే ట్యాప్ అయ్యాయని అనుకున్నా. కానీ ఆ జాబితా రెండు వేలకు పైగా ఉంది. నాకు దగ్గరిగా ఉన్న వారి ఫోన్లనూ విన్నారు. విచిత్రం ఏమిటంటే, ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఫోన్లనే ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భార్యలు, పనిమనుషులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశారు.
రాధా కిషన్ రావు ఎవరో తెలియదని కేసీఆర్ అన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన జీవో తెచ్చింది కేసీఆర్ కాదా?. ఇలాంటి నీచమైన రాజకీయాలు ప్రపంచంలో బీఆర్ఎస్ తప్ప ఎవరూ చేయరు. ఇది ముమ్మాటికీ కేసీఆర్, కేటీఆర్ చేయించిన ట్యాపింగే. రాధా కిషన్ రావు ఆస్తులపై విచారణ చేయించాలి. లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసును సీఎం రేవంత్ రెడ్డి పారదర్శకంగా విచారణ చేయించాలి. నాపై ఈడీ దాడులు జరగడానికి ముందే నా ఫోన్ సంభాషణలు విన్నారు. ఈ కేసు నిందితులకు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి' అని తెలిపారు.
కాగా, బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలంగాణ డీజీపీకి చికోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ట్యాపింగ్ చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో చికోటి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు నేడు విచారణకు పిలిచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
విద్యాసంస్థల్లో ర్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు.. సేఫ్ ఎన్విరాన్మెంట్ ముఖ్యం: సీపీ సజ్జనార్
యువతకు ప్రధాని మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ: జగ్గారెడ్డి