Share News

అర్హత లేకున్నా అందలం

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:52 AM

సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఇన్‌చార్జి సెక్రటరీగా నాన్‌-ఐఏఎస్‌ నియామకంపై వివాదం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీయడంతో సీనియర్‌ ఐఏఎస్‌ను పూర్తిస్థాయి సెక్రటరీగా నియమించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అర్హత లేకున్నా అందలం
Telangana Gurukula Society

  • సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ

  • ఇన్‌చార్జి సెక్రటరీగా నాన్‌-ఐఏఎస్

  • నిబంధనలకు విరుద్ధంగా నియామకంపై సీఎం సీరియస్‌

  • పూర్తిస్థాయి సెక్రటరీగా ఐఏఎస్‌ నియామకంపై కసరత్తు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది విద్యార్థులు.. వందల గురుకులాలు.. వేల మంది సిబ్బందితో కూడిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా తొలిసారి నాన్‌-ఐఏఎ్‌స అధికారిని ఇన్‌చార్జి (ఎఫ్‌ఏసీ)గా నియమించటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఇంత పెద్ద సొసైటీకి నాన్‌-ఐఏఎ్‌స అధికారిని సెక్రటరీగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం.


దీంతో త్వరలో సొసైటీకి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పోస్టులో సమర్థులైన ఒక ఐఏఎస్‌ అధికారిని పూర్తిస్థాయి సెక్రటరీగా నియమించాలని ఆ శాఖ మంత్రి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, సచివాలయానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెరవెనుక చక్రం తిప్పి సొసైటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న కంభంపాటి శారదను ఎఫ్‌ఏసీగా నియమించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సొసైటీలో జరుగుతున్న పరిణామాలు, అంతర్గత సమాచారం లీకవుతుండటం వంటి అంశాలపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించి వివరాలు సేకరించినట్లు సమాచారం.


సరైన అర్హత లేకున్నా అంతటి భారీ వ్యవస్థకు ఇన్‌చార్జిగా ఎలా ఉంచుతారు? అని ఉన్నతాధికారులను ప్రశ్నించటంతో గురుకుల వర్గాల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో ఏర్పడిన ఈ సొసైటీకి ఇప్పటివరకు 60 మందికి పైగా సెక్రటరీలుగా పనిచేశారు. వారిలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాత్రమే ఐపీఎస్‌ కాగా... మిగిలిన వాళ్లంతా ఐఏఎస్‌ అధికారులే. అలగు వర్షిణి బదిలీ తర్వాత.. కృష్ణ ఆదిత్యకు ఎఫ్‌ఏసీ ఇచ్చి.. ఆ తర్వాత పూర్తిస్థాయి అధికారిగా విజయేంద్రబోయిని ప్రభుత్వం నియమించింది. ఆమె ఎస్సీడీడీ కమిషనర్‌గా వెళ్లిపోవడంతో.. ఆ స్థానాన్ని అదే సంస్థలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్న కంభంపాటి శారదకు ఇచ్చారు. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సొసైటీకి ఐఏఎస్‌ /ఐపీఎస్‌ అధికారిని మాత్రమే నియమించాలి. కానీ, కనీసం గ్రూప్‌-1 అధికారినైనా కాకుండా.. సొసైటీ చరిత్రలో మొదటిసారి నాన్‌-ఐఏఎ్‌సను నియమించారు. ఈ వ్యవహారంపై సీఎం స్వయంగా ఆరా తీయటంతో అధికారుల్లో కదలిక వచ్చింది. శారదను బాధ్యతల నుంచి తప్పించి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పూర్తిస్థాయి సెక్రటరీగా నియమించేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.


వార్తలనూ చదవండి:

గురువే హంతకుడు
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:52 AM