Share News

జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ: మంత్రి వాకిటి శ్రీహరి

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:15 PM

హైదరాబాద్‌లో జూన్ 8న నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు.

జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ: మంత్రి వాకిటి శ్రీహరి
Fish Prasadam 2026

హైదరాబాద్‌: చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తెలిపారు. ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. చేప ప్రసాదం అనేది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశమని, ఎలాంటి ప్రచారాలు చేయకపోయినా దేశం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని వారు పేర్కొన్నారు.


అపోహలకు తావు ఇవ్వకుండా..

చేప ప్రసాదం వల్ల ప్రయోజనం పొందిన వారే ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారని, శాస్త్రానికి అంతుచిక్కని అనేక విషయాలు ఉన్నాయని వారు వ్యాఖ్యానించారు. అందువల్ల అపోహలకు తావు ఇవ్వకుండా ప్రజలు నమ్మకంతో పాల్గొనాలని సూచించారు.

చేపపిల్లలు సిద్ధం

ఈసారి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా మూడు లక్షలకు పైగా చేపపిల్లలను సిద్ధం చేసినట్లు తెలిపారు. చివరి వ్యక్తి వరకు చేప ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.


జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు

జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై, జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. గత సంవత్సరాల కంటే ఎక్కువ సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

అధైర్యపడకండి

అలాగే 200 మందికి పైగా మత్స్యశాఖ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని సేవలు అందించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.


Also Read:

గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

చాట్‌జీపీటీతో పెట్టుకుంటే ఇంతే... పరీక్ష రాస్తున్న విద్యార్థికి షాక్

Updated Date - Jun 06 , 2026 | 03:20 PM