చాట్‌జీపీటీతో పెట్టుకుంటే ఇంతే... పరీక్షలో విద్యార్థికి షాక్
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:05 PM
పరీక్ష రాసే సమయంలో చాట్‌జీపీటీ సాయం తీసుకునేందుకు ప్రయత్నించిన ఒక విద్యార్థికి ఎదురైన అనుభవం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో అనేక మంది విద్యార్థులు చదువుల్లో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చాట్‌జీపీటీపై ఆధారపడుతున్నారు. అయితే, కొందరు మాత్రం పరీక్షల్లో కూడా చాట్‌జీపీటీని వాడి గట్టెక్కేద్దామని ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఒక విద్యార్థికి చాట్‌జీపీటీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పుష్పాంజలి సింగ్ అనే నెటిజన్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. పరీక్షలో చాట్‌జీపీటీ సాయం తీసుకునేందుకు ప్రయత్నించిన ఒక విద్యార్థికి ఆ చాట్‌బాట్ ఎలాంటి షాకిచ్చిందీ చెబుతూ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. పరీక్షలో ఎదురైన ప్రశ్నకు సమాధానాన్ని ఆ విద్యార్థి అడుగుతున్నట్టు చాట్‌జీపీటీ గుర్తించింది. సమాధానం ఇచ్చేందుకు నో చెప్పేసింది. ‘మీరు పరీక్ష మధ్యలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో సమాధానాలు చెప్పలేను. నైతిక నిబంధనలు అంగీకరించవు’ అంటూ కుండబద్దలు కొట్టింది.

ఇక ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఉద్యోగార్థులకు ఇంటర్వ్యూల మధ్యలో చాట్‌జీపీటీ ఇలాగే హ్యాండిస్తే వాళ్ల గతి ఏమవుతోందో? అని కొందరు సరదా వ్యాఖ్యలు చేశారు. చదువుల విషయంలో ఈ మధ్య చాట్‌జీపీటీ స్ట్రిక్ట్‌గా అవుతోందని మరికొందరు కామెంట్ చేశారు. అసలు చాట్‌జీపీటీకి విద్యార్థి పరీక్షలో ఉన్నట్టు సందేహం ఎందుకొచ్చిందని కొందరు ప్రశ్నించగా విద్యార్థే పొరపాటున చెప్పి ఉండొచ్చని కొందరు రిప్లై ఇచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
నిజాయతీతో నెటిజన్ల మనసు దోచుకున్న ఆటో డ్రైవర్..
విమానంలో రుసుం వివాదం.. పోలీస్ సిబ్బందిని కరిచిన మహిళ