నిజాయతీతో నెటిజన్ల మనసు దోచుకున్న ఆటో డ్రైవర్..
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:46 PM
ఓ ఆటో డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన నిజాయతీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి శభాష్ అనిపించుకుంటున్నాడు. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన నగదును తిరిగి చెల్లించి నిజాయితీ చాటుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ ఆటో డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన నిజాయతీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి శభాష్ అనిపించుకుంటున్నాడు. పొరపాటున తన ఖాతాలోకి వచ్చిన నగదును తిరిగి చెల్లించి నిజాయతీ చాటుకున్నాడా డ్రైవర్. దీనికి సంబంధించిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. అతని స్వచ్ఛమైన మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ క్లయింట్‌ను కలిసేందుకు తాను ఆటో ఎక్కినట్లు ఓ ప్రైవేటు కంపెనీ సీఈవో తెలిపారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రూ.156లకు బదులుగా పొరపాటున రూ.15,682 చెల్లించినట్లు పేర్కొన్నారు. అనంతరం హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. మీటింగ్ అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే, తమ మీటింగ్ పూర్తయ్యి బయటకు వచ్చేంత వరకు ఆటో డ్రైవర్ అల్తాఫ్ అక్కడే వేచి ఉన్నాడని సీఈవో తెలిపారు. తాను ఎంత మొత్తం చెల్లించానో గమనించకపోయినా.. ఆటో డ్రైవరే వచ్చి రూ.15,682 మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడని చెప్పారు.
ఆటో ఛార్జీ రూ.156 తీసుకోమని కోరినా.. మొత్తం తిరిగి ఇచ్చేశాడని పేర్కొన్నారు. 'మీరు నా కోసం ఎదురు చూశారు.. ప్రయాణాలు కోల్పోయారు.. అది మీ డబ్బు' అని చెప్పినా అల్తాఫ్ తీసుకోలేదని తెలిపారు. తన పరిస్థితి, నిరాశను చూసి డ్రైవర్ డబ్బులు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే, సరిగ్గా వారం తర్వాత ఆ క్లయింట్ తనకు ఫోన్ చేశారని, తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారన్నారు. ఆ వార్త తెలియగానే తనకు ఆటో డ్రైవర్ అల్తాఫ్ గుర్తొచ్చాడని, వెంటనే అతని ఖాతాలోకి రూ.500 పంపించినట్లు సీఈవో వెల్లడించారు. ఇది తాను వెలకట్టలేని కృతజ్ఞతా చిహ్నమంటూ లింక్డ్‌ఇన్ వేదికగా చెప్పుకొచ్చారు. కాగా, ఈ పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అభిజీత్ దీప్కే.. వీడియో వైరల్..
విమానంలో రుసుం వివాదం.. పోలీస్ సిబ్బందిని కరిచిన మహిళ