Makar Sankranti 2026: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ఈ పని తప్పక చేయండి..!
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:01 AM
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగర వాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు..
హైదరాబాద్, జనవరి 5: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ చేసి నగర వాసులను అప్రమత్తం చేశారు.
పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారు. ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు సీపీ. ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోగానీ, బీట్ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని పేర్కొన్నారు.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సీపీ సజ్జనార్ ప్రజలకు హితవు పలికారు. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని, నేరాలను ముందుగానే నివారించడం కూడా అని ఆయన పేర్కొన్నారు. పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, మీ ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.
Also Read:
Venezuela oil sector: వెనుజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
Tirumala Temple: రికార్డు స్థాయిలో తిరుమలేశుడి దర్శనాలు
Hospitality Career Industry: ఆసక్తిపరులకే అనువైనది ఆతిథ్య రంగం