Share News

అందుకే వాళ్లకు వణుకు పుడుతుంది: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - May 15 , 2026 | 01:41 PM

కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అందుకే వాళ్లకు వణుకుపుడుతుందన్నారు.

అందుకే వాళ్లకు వణుకు పుడుతుంది: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్, మే15: కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు దొంగ ఓట్లతో గెలిచారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అందుకే వాళ్లకు వణుకుపుడుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరగనున్న సర్‌ (SIR) ప్రక్రియపై సుదర్శన్ రెడ్డితో వారు చర్చించారు.

అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. 14 రాష్ట్రాల్లో సర్ (SIR) ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. దుర్మార్గంగా ఓట్ల ప్రక్రియ జరిగిందంటూ మండిపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శమన్నారు. దేశంలో 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే.. 5.90 లక్షల ఓట్లు తొలగించారని విమర్శించారు. బెంగాల్‌లో రాజకీయ సమీకరణాలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు ఓటమి పాలయ్యాయన్నారు. బెంగాల్‌లో 90 లక్షల ఓట్లు తొలగించి.. 60 లక్షలు కలిపారని చెప్పారు.


తెలంగాణలో వచ్చే రెండు ఏళ్లలో ఎన్నికలు లేవన్నారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియ ఏడాది జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని తాము కోరామని టీపీసీసీ చీఫ్ తెలిపారు. పేదల ఓట్లు తొలగిస్తే వారు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేరన్నారు. ఈ నేపథ్యంలో అందుకు 3 నెలలు సమయం ఇవ్వాలని చెప్పారు. మూడు సార్లు బీఎల్‌వో (BLO)లు.. వారి ఇంటికి వెళ్లి పరిశీలన చేయాల్సి ఉందని తెలిపారు.


కొన్ని చోట్ల బయట దేశస్థులు ఉన్నారనే నెపంతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా SIR జరగాల్సి ఉందని ఆకాంక్షించారు. బీజేపీకి పడని ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఎవరి ఓట్లు వారే కాపాడుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి తెలంగాణలో SIR ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జూలై 24 దాకా ఓటర్ల వివరాల సేకరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురణ చేస్తారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇంధన ధరలు పెంపును రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు: మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

For More TG News And Telugu News

Updated Date - May 15 , 2026 | 02:00 PM