Share News

గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ. 12 లక్షల కోట్ల నిధులిచ్చింది: కిషన్ రెడ్డి

ABN , Publish Date - May 10 , 2026 | 06:46 PM

గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ. 12 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ వెన్నుపోటు పొడిచిందని, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం రూ. 12 లక్షల కోట్ల నిధులిచ్చింది: కిషన్ రెడ్డి
Kishan Reddy Attacks Congress in Telangana

హైదరాబాద్, మే 10: తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అందరినీ వెన్నుపోటు పొడిచిందని, ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పుడు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో ప్రజలను వంచిస్తున్నారని రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

అభివృద్ధి చేసింది మేమే.. సమాధానం చెప్పండి!

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాత్రను వివరిస్తూ కిషన్ రెడ్డి కీలక గణాంకాలను వెల్లడించారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏకంగా రూ. 12 లక్షల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల (Highways) కోసం రూ. 1.85 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా 5 వందేభారత్‌ రైళ్లు, 42 రైల్వేస్టేషన్ల అభివృద్ధి, అలాగే 3 బుల్లెట్‌ ట్రైన్స్‌ కూడా తెలంగాణకు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సన్న బియ్యం పథకానికి కేంద్రమే 80 శాతం నిధులు ఇస్తోందని స్పష్టం చేశారు.


హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి.. 'ఇవన్నీ రాహుల్‌ గాంధీ ఇచ్చారా? లేక కేసీఆర్‌ తెచ్చారా? ఇది మోదీ ప్రభుత్వ నిబద్ధత కాదా?' అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ.. ఆయన కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలకు తెరలేపిందని, 'SIR' పేరుతో ప్రభుత్వం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ

'పదేళ్లు ఒకే కుటుంబం (BRS) చేతిలో బందీ అయిన తెలంగాణ, ఇప్పుడు గాంధీ కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది. అబద్ధపు గ్యారంటీలతో ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటు. కానీ మేము మాట తప్పం కాబట్టే కేంద్రంలో 3సార్లు అధికారంలోకి వచ్చాం' అని ఆయన పేర్కొన్నారు.

ఎక్కడైనా బీజేపీదే విజయం!

దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటమే మా పనితీరుకు నిదర్శనమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలిచామని, ఈసారి ఆ విజయపరంపర మరింత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విముక్తి చెందాలంటే అది కేవలం 'మోదీ గ్యారంటీ'తోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి..

మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..


విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..

Updated Date - May 10 , 2026 | 06:52 PM