Share News

జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం..

ABN , Publish Date - Aug 31 , 2026 | 08:59 PM

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బలమైన, సుస్థిర ఆర్థిక విధానాలు, సంస్కరణలకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం..
Union Minster Kishan Reddy

న్యూఢిల్లీ: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బలమైన, సుస్థిర ఆర్థిక విధానాలు, సంస్కరణలకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 6.9 శాతం వృద్ధితో పోలిస్తే.. తాజా వృద్ధి రేటు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను మరోసారి చాటిచెప్పిందని అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.


కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..

'ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల్లో ఒడిదుడుకులు, సప్లై చైన్ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఇంతటి వృద్ధిని సాధించడం అసాధారణ విజయం. ఇది ప్రధాని మోదీ దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన విధానాలపై ప్రజలు, వ్యాపారవేత్తలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అన్ని ప్రధాన రంగాల్లో ఆర్థిక వృద్ధి విస్తృతంగా కనిపించడం సానుకూల పరిణామం. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 3.6 శాతం వృద్ధి సాధించడంతో ప్రైమరీ సెక్టార్ (వ్యవసాయం, మత్స్యరంగం, మైనింగ్, అటవీ సంపద) సానుకూల వృద్ధిని సాధించింది.


అదే సమయంలో సెకండరీ సెక్టార్ (తయారీ, నిర్మాణ, విద్యుత్ రంగాలు) 8.6 శాతం, తృతీయ రంగం (రిటైల్ దుకాణాలు, బ్యాంకింగ్, విద్య, వైద్యం, రవాణా మొదలైనవి) 10 శాతం వృద్ధిని నమోదు చేయడం గొప్ప విషయం. ముఖ్యంగా ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు 12.1 శాతం వృద్ధిని నమోదు చేయడం భారత సేవా రంగం ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తోంది. వ్యవసాయ రంగం దూసుకెళ్తున్న తీరు ఆశాజనకంగా ఉంది. ఎల్‌నినో వంటి వాతావరణ సవాళ్లు ఉన్నప్పటికీ గతేడాదితో సమానంగా సాగు ఉండటం సానుకూల పరిణామం. రానున్న రెండో, మూడో త్రైమాసికాల్లో వ్యవసాయ రంగం మరింత మెరుగైన పనితీరును కనబరిచి దేశ ఆర్థిక వృద్ధికి మరింత బలం చేకూర్చుతుందనే విశ్వాసం కలుగుతోంది.


2026-27 తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం ‘గొప్ప విజయం’. ఈ ఘనత సాధించడం వెనుక 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి ఉంది. ప్రధాని మోదీ చెప్పినట్లు.. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న వారి కలలు కల్లలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మళ్లీ వికసించింది. దేశాన్ని, ప్రభుత్వాన్ని, భారత ఆర్థిక వ్యవస్థను నిరంతరం కించపరిచేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ జీడీపీ గణాంకాలు గట్టి సమాధానం. భారత ప్రగతిని తక్కువ చేసి చూపించే వారికి ఇదొక గట్టి చెంపదెబ్బ. ప్రజలు.. రాజకీయ విమర్శల కంటే వాస్తవాలనే విశ్వసిస్తారు. ఈ ఫలితాలే ఇందుకు నిదర్శనం. మౌలిక సదుపాయాల కల్పన, తయారీ రంగం, వ్యవసాయం, సేవలు, పెట్టుబడులు, డిజిటలైజేషన్, వ్యాపార సౌలభ్యం వంటి రంగాల్లో మోదీ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంస్కరణలు దేశాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయి.


ఇది ఒక్క త్రైమాసికంలో సాధించిన వృద్ధి మాత్రమే కాదు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది మరో బలమైన ముందడుగు. భారత్ ఎదుగుతోంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది, ఈ జోరును ఆపడం ఎవరి వల్లా కాదు' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ రాజీనామా చేయాలి.. ఆందోళనలకు పిలుపునిచ్చిన సీఎం

‘తెలంగాణ–జర్మనీ’ లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటుకు సహకరించండి: మంత్రి శ్రీధర్‌బాబు

Updated Date - Aug 31 , 2026 | 08:59 PM