బీఆర్ఎస్ నేతలతో ఐదు గంటలుగా కొనసాగుతున్న కేసీఆర్ భేటీ
ABN , Publish Date - May 12 , 2026 | 07:31 PM
బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ దాదాపు ఐదు గంటలుగా కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ వివిధ అంశాలపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
సిద్దిపేట: బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ దాదాపు ఐదు గంటలుగా కొనసాగుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ వివిధ అంశాలపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్యమైన విషయాలపై కేసీఆర్ అధ్యక్షతన చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభా పక్షాల ఉపనాయకులు పాల్గొన్నారు.
అలాగే అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఉన్న గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల రద్దుపైనా సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీల స్థానంలో కొత్త కమిటీలను ఎన్నుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కమిటీల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా నేతలతో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ పర్యటనపైనా కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ కుమారుడి కేసు వ్యవహారం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశం గురించి కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వివరించినట్లు సమాచారం. కొత్తగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపైనా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. అలాగే ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై బలంగా పోరాటాలు చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. వాహనాల దగ్ధం
మంత్రి పొన్నం వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: మహేశ్ గౌడ్