Share News

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:10 AM

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
Former CM KCR

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. పెద్దిని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో వరంగల్ జిల్లా నుంచి తనతో కలిసి సుదర్శన్ రెడ్డి నడిచిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి, నిజాయితీతో ప్రజాజీవితాన్ని సాగించిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది.. అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు.


పోలీసుల ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్యసాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోతాయని అన్నారు. పెద్దిని కోల్పోయి శోకతప్త హృదయులుగా ఉన్న ఆయన భార్య, పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, పెద్ది కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..

అదే జోరు.. వాన హోరు

Updated Date - Jul 31 , 2026 | 07:19 AM