Share News

ఒడువని వాన

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:10 AM

ఎల్‌నినో కరువు భయాలు నెలకొన్నవేళ తెలంగాణపై వరుణుడు కరుణించాడు. రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఏకమయ్యాయి...

ఒడువని వాన

  • రాష్ట్రవ్యాప్తంగా 2 రోజులుగా భారీ వర్షాలు

  • పొంగుతున్న వాగులు, వంకలు.. నిండుకుండల్లా చెరువులు

  • రిజర్వాయర్లలోకి భారీగా వరద.. ఎల్లంపల్లి 30 గేట్లు ఎత్తివేత

  • గోదావరిలో వరద ఉధృతి.. భద్రాచలం వద్ద 29 అడుగులకు

  • ఆల్మట్టి నిండటంతో కృష్ణానదిలోనూ మొదలైన వరద

  • గురువారం శ్రీశైలం వైపుగా లక్ష క్యూసెక్కుల ప్రవాహం

  • ఆనందంలో అన్నదాతలు.. పొలం పనులు వేగవంతం

  • మరో రెండురోజులు భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎల్‌నినో కరువు భయాలు నెలకొన్నవేళ తెలంగాణపై వరుణుడు కరుణించాడు. రాజధాని హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఏకమయ్యాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. గురువారం రాత్రి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలతో మురిసిపోతున్న అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని శ్రీనివా్‌సరెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదే శించారు. రాష్ట్రంలో మరో రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


దంచికొట్టిన వాన

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు, కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా చెరువులు నిండుకుండల్లా మారాయి. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ శివారులోని బతుకమ్మ కుంట కట్ట తెగింది. ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌ కొండాపూర్‌ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరద ఉధృతికి దహెగాం మండలంలోని కుంచవెల్లి సమీపంలో పీపీరావు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. అత్యధికంగా సారంగాపూర్‌ మండలంలో 128.1 మిల్లీమీటర్లు, వెల్గటూరు మండలంలో 103.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో 183.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గురువారం రాత్రి 9 గంటల సమయంలో 3,90,300 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి గోదావరిలోకి 4,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 4,38,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, ఇందులో 1,65,000 ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతుందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. ఇప్పటివరకు 1,97,388 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేయగా, ఇందులో వరి 1,13,346 ఎకరాల్లో ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. గురువారం అత్యధికంగా పలిమెల మండలంలో 155.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాటారం అలుగువాగు పొంగటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి-ఓడేడు గ్రామాల మధ్య మానేరుపై తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో భూపాలపల్లి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరిగి గురువారం సాయంత్రానికి 2.12 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

అన్నదాత సంబరాలు

వర్షాలతో వరంగల్‌ జిల్లాలో రైతులు మురిసిపోతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనప్పటికీ చినుకు జాడలేక పంటలకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా వరుణుడు కరుణించాడు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. వర్షాభావంతో కొన్నిచోట్ల భూమిలోనే విత్తనాలు మాడిపోవటంతో రెండోసారి విత్తనాలు వేశారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు ఈ పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పాకాల, రామప్ప, లక్నవరం, పాలెం ప్రాజెక్టు, గణపసముద్రంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. అత్యధికంగా ఆర్మూర్‌ మండలం మగ్గిడిలో 7.8 సెం.మీల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వాగులు పొంగుతున్నాయి. కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీరా నదిలోకి భారీగా వరద వస్తోంది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది.


గోదావరి ఉగ్రరూపం..

ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్‌ జలకళ సంతరించుకుంది. గురువారం సాయంత్రం 4 గంటల సమయానికి బ్యారేజీలోకి 7,10,300 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు మొత్తం 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదులుతున్నారు. పాలెం ప్రాజెక్టులోకి 4,650 క్యూసెక్కుల నీరు చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 7.2 మీటర్ల నీటిమట్టం నమోదైంది. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం 2 గంటకు 29 అడుగులకు చేరుకోగా.. 4,06,111 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించింది. శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటనుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలో భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు నిండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మొదలైంది. దాదాపు లక్ష క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టువైపు వస్తోందని అధికారులు తెలిపారు.

బొగత సోయగం

తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. చుట్టూ పచ్చని కొండలు, పక్షుల కిలకిలారావాల నడుమ పాలసంద్రంలా జలధారలు జాలువారుతున్నాయి. అయితే, ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం పర్యాటకులకు లేకుండాపోయింది. జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా బుధ, గురువారాల్లో సందర్శనను నిలిపివేశారు.

1-Telanga-31-07-2026.jpg

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 06:10 AM