Share News

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

ABN , Publish Date - Jul 30 , 2026 | 03:04 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఓ చైనా కంపెనీపై దాడి చేసింది.

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
Chinese Company in Kuwait attacked

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయి. తాజాగా ఇరాన్ ఓ చైనా కంపెనీపై దాడి చేసింది. ఉత్తరకువైట్‌లోని కంపెనీపై గురువారం ఉదయం మిసైల్ దాడికి దిగింది. ఈ ఘటనలో కంపెనీ భవనం భారీగా దెబ్బతినగా ఒక వర్కర్ మృతి చెందారు. ఈ దాడిని ఖండిస్తూ కువైట్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇరాన్‌పై మరో విడత దాడులను ముగించామని అమెరికా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రతీకార దాడులు వెలుగు చూశాయి. అంతకుముందు జోర్డాన్‌లోని తమ స్థావరంపై దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ను టార్గెట్ చేశామని అమెరికా తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పశ్చిమాసియా వ్యవహారాలను పర్యవేక్షించే యూఎస్ సైనిక విభాగం సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) లక్ష్యంగా పలుమార్లు దాడులు జరిపామని సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఐఆర్‌జీసీకి చెందిన కమాండ్ సెంటర్లు, తీరప్రాంత గస్తీ వ్యవస్థలు, ఇతర రక్షణ రంగ స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది. జోర్డాన్‌లో అమెరికా సైనికులు ఉన్న స్థావరంపై దాడులకు గట్టి బదులిస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ అంతకుముందే ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు.

ఇక ఇరాక్‌లోని ఇరాన్ అనుబంధ మిలిటెంట్లపై యూఎస్ బుధవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. సౌదీతో కలిసి చేసిన ఈ దాడుల్లో 20 మంది సాయుధులతో పాటు ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారు.


ఈజిప్ట్‌లోనూ డ్రోన్ దాడి!

ఇదిలా ఉంటే, ఈజిప్ట్‌లోని డామియెట్టా పోర్టుపై బుధవారం జరిగిన డ్రోన్ దాడిలో రెండు సహజవాయువు రవాణా నౌకల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ డ్రోన్ దాడికి కారకులు ఎవరో ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లార్చేందుకు ఈజిప్ట్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటివరకూ ఈజిప్ట్‌పై నేరుగా పడలేదని నిపుణులు చెబుతున్నారు. తాజా దాడి ఇరాన్ చేసినట్టు తేలితే మాత్రం గల్ఫ్ యుద్ధం మరింత ముదిరినట్టేనని అంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు

Updated Date - Jul 30 , 2026 | 03:29 PM