ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:44 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ.. ఇరాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
వాషింగ్టన్ డీసీ, జులై 30: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ ఇరాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు (Airstrikes) చేసింది. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు నిలిపివేసిన తర్వాత ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం.
ఈ దాడులపై అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) స్పందిస్తూ.. తమ దళాలపై ఇరాన్ చేసిన దాడులకు ఇది అత్యంత బలమైన సమాధానమని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ వైమానిక దాడులు జరిగాయి.
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఐదు బ్యాలిస్టిక్ క్షిపణులను (Ballistic Missiles) ప్రయోగించిన సంగతి తెలిసిందే. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు (Patriot Air Defense System) ఆ క్షిపణులన్నింటినీ విజయవంతంగా కూల్చివేశాయి. అయితే ఇప్పుడు తమ దళాలపై జరిగిన ఈ దాడికి ప్రతికారంగా అమెరికా ఈ దాడులకు దిగింది.
అమెరికా దాడుల తీవ్రత
దాడుల గురించి అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ ఇరాన్ చేసిన దాడులకు ఇదొక 'శక్తిమంతమైన సమాధానం' అని పేర్కొంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించారు. ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్, బుషెహర్, హోర్ముజ్ జలసంధిలోని 'ఖెష్మ్' (Qeshm) ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
ఇరాన్‌పై దాడులు ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'ఫాక్స్ న్యూస్' (Fox News) ఇంటర్వ్యూలో అత్యంత తీవ్రమైన భాషలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 'మేము వారిపై చాలా తీవ్రంగా విరుచుకుపడతాం. వారిని తీవ్రంగా దెబ్బతీస్తాం... ఇప్పుడు మా వంతు వచ్చింది' అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఈ దాడిని ఇరాన్ బహిరంగంగా అంగీకరించడం వారు చేసిన పెద్ద పొరపాటని వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, చర్చల పునరుద్ధరణకు వీలుగా దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ గత శుక్రవారం ప్రకటించారు. అయితే, జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో ఆ తాత్కాలిక విరామానికి తెరపడింది. దాంతో ఐదు రోజుల వ్యవధిలోనే అమెరికా తన మిలిటరీ చర్యలను పునరుద్ధరించాల్సి వచ్చింది.
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్, కమాండ్ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులన్నింటినీ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా సైన్యం స్పష్టం చేసింది.
అమెరికా నుంచి బెదిరింపులు కొనసాగినంత కాలం తమ వైపు నుంచి దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ అంటోంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధి మార్గంలో తమ అనుమతి లేని రూట్‌లో ప్రయాణిస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ నావికాదళం ప్రకటించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్