Share News

రైతులపై కేసులు నమోదు.. అత్యంత హేయమైన చర్య: ఎమ్మెల్యే హరీశ్ రావు

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:31 PM

జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దీనిపై గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందించారు.

రైతులపై కేసులు నమోదు.. అత్యంత హేయమైన చర్య: ఎమ్మెల్యే హరీశ్ రావు
BRS MLA Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 08: జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. దీనిపై గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందించారు. ‘కళ్ల ముందే ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య. రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటు’.


‘ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. మీ చేతగానితనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి. కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా?. పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం?. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు’.


‘నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా?. సాగునీరు లేక, కరెంట్‌ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి.. కేసులు అక్రమ కేసులు పెడతారా?. ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా?. రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 01:42 PM