సుల్తాన్‌పూర్ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం!
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:47 AM
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది.
జూనియర్ గొంతు నులిమిన సీనియర్లు..
బాధితుడికి గాయాలు
పుల్‌కల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ర్యాగింగ్ ఉదంతం కలకలం రేపింది. ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడగా, బాధితుడి మెడ, గొంతు భాగంలో గాయాలయ్యాయి. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెషర్స్ డే వేడుకలకు సంబంధించి మూడు రోజుల క్రితం ఆయా విభాగాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థుల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో గొడవలతో ఏ మాత్రం సంబంధం లేని నాలుగో సంవత్సరం మెకానికల్ విద్యార్థులు సోమవారం రంగంలోకి దిగి, ఈఈ ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రుత్విక్ అనే విద్యార్థిపైదాడి చేశారు. అతని గొంతు నులమడంతో మెడపై గాయం కాగా, గమనించిన తోటి విద్యార్థులు బాధితుడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న రుత్విక్ తల్లిదండ్రులు మంగళవారం కళాశాలకు చేరుకున్నారు. కాగా, ఫ్రెషర్స్ డే నిర్వహణకు ఎలాంటి సంబంధం లేని నాలుగో ఏడాది విద్యార్థులు దాడి చేయడంపై ఈఈఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. సీనియర్లు తమను వేధిస్తున్నారని ప్రిన్సిపాల్ విశ్వనాథరాజుకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా తరగతులు బహిష్కరించి, సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యార్థుల ఆందోళనలతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. జోగిపేట సీఐ అనిల్‌కుమార్, పుల్కల్ ఎస్సై విశ్వజన్ చేరుకుని వారితో చర్చలు జరిపారు. కాగా, ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు బి.జ్ఞాన్ కార్తిక్, సి.మాధవ్ తేజలను యూనివర్సిటీ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ వల.. చిక్కితే విలవిల!
ధరణి ముసుగులో రికార్డులు తారుమారు
Read Latest Telangana News And Telugu News