Share News

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి..

ABN , Publish Date - Jun 11 , 2026 | 06:29 PM

భారతీయ జనతా పార్టీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండకూడదని ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరణపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి..
Congress Leader Jagga Reddy

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండకూడదని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమోదు కాని ప్రైవేట్ కేసును అడ్డుపెట్టుకుని నామినేషన్‌ను తిరస్కరించడం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీనాక్షి రాజ్యసభ సభ్యురాలు కాకుండా బీజేపీ సీటు చోరీ చేసిందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తలదించుకునేలా పాలన చేస్తున్నారు. ఓట్ల చోరీ చేస్తూ బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే జరిగింది. తాజాగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికను అడ్డుకుని సీటు చోరీ చేశారు. సాదాసీదా మీనాక్షి నటరాజన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. దేశంలో బీజేపీ మహాభారతాన్ని మళ్లీ మొదలుపెట్టింది. మహాభారతంలో రాహుల్ గాంధీ ధర్మరాజులాంటి వాడు. మోదీ కౌరవుల నాయకుడు దుర్యోధనుడి లాంటివాడు. దుర్యోధనుడి కుటుంబంలో అందరూ డేంజరే. రాహుల్ గాంధీ శత్రువులను కూడా ప్రేమిస్తారు. మోదీ మిత్రులను కూడా శత్రువుల్లా చూస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను ఏం చేయాలనే ఆలోచన తప్ప మోదీకి వేరే పనే ఉండదు. పరిపాలన చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఒక్క రాజ్యసభ సీటు కోసం మోదీ ఇంత దిగజారాలా?. దేశంలో బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోంది.


మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ, రాహుల్ గాంధీ ప్రకటించారు. రెండు రాజ్యసభ సీట్లు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి నైతిక విలువలు లేవు. మీనాక్షి నటరాజన్‌ను అడ్డుకోవడానికి దేశ ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. నటరాజన్ నిజాయతీ గల మనిషి. ఆమెను రాజ్యసభకు ఎన్నిక కాకుండా కింది స్థాయి నుంచి మోదీ వరకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. మోదీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క రాజ్యసభ సీటు కోసం పీఎంవో కార్యాలయం ఎందుకు ఇంతలా పని చేయాలి?. ఆమెకు నోటీసులు మాత్రమే ఇచ్చారు, కేసు నమోదు కాలేదు. ఇంతలా పొలిటికల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో తెలంగాణ బీజేపీ నేతలు చెప్పాలి. 12 సంవత్సరాల్లో మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయారు?. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?' అని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి.. కేంద్రానికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి

నేటికి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయని సీఎం రేవంత్: కవిత

Updated Date - Jun 11 , 2026 | 06:33 PM