అంతా కలలా ఉంది.. నా భార్య చాలా ధైర్యవంతురాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 07:30 AM
అంతా కలలా ఉంది.. భార్యా పిల్లలు మళ్లీ తిరిగొస్తే బాగుండు.. అన్నారు విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి. భార్య, పిల్లల ఆత్మహత్య తెలుసుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మాట్టాడుతూ... నా భార్య చాలా ధైర్యవంతురాలని, పిల్లలకు వాళ్ల అమ్మంటే అమితమైన ప్రేమ అని అన్నారు.
భార్యా పిల్లలు మళ్లీ తిరిగొస్తే బాగుండు
నా భార్య చాలా ధైర్యవంతురాలు
పిల్లలకు వాళ్ల అమ్మంటే అమితమైన ప్రేమ
ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలియడం లేదు
మీడియాతో విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ: ‘నా భార్య చాలా ధైర్యవంతురాలు. ఇంట్లో ఆమెది తుది నిర్ణయం. ఆమె ఏం చెప్పినా పిల్లలు కాదనరు. పిల్లలకు వాళ్ల అమ్మంటే అమితమైన ప్రేమ..’ అంటూ విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి(Surender Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్త సురేందర్‌రెడ్డి మంగళవారం పలు విషయాలు వెల్లడించారు. భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నారు.
‘అంతా ఒక కలలా ఉంది. ఒక్కసారిగా అందరూ లేచి వస్తే బాగుండు’ అని కన్నీరు మున్నీరుగా విలపించారు. బీబీనగర్‌లోని నివాసంలో ఆయన్ను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన తో జనవరి-29న చివరి ఫోన్‌కాల్ మాట్లాడిందని, ఇద్దరం పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకున్నామని, తమ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకునేది అని అన్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పదేపదే చెప్పేదని తెలిపారు. కుటుంబ తగాదాలుగానీ, ఆర్థిక ఇబ్బందులు గానీ లేవన్నారు. 14 నెలలుగా తాను దుబాయ్‌లోనే ఉద్యోగం చేస్తున్నప్పటికీ వచ్చే మార్చిలో ఇంటికి వద్దామని అనుకున్నానని తెలిపారు. ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం జరిగిందో..? ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుందో పోలీసుల విచారణలో తేలుతుందేమో చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా.. మరోవైపు రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల డేటా రిపోర్టు మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ డేటా విశ్లేషణ వెలుగులోకి వస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటర్ చదువుతున్న పిల్లలను ఒప్పించి తనతో పాటు.. తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పిన ఆ బలమైన కారణం ఏమై ఉంటుందా అని పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. మొబైల్ ఫోన్‌లోనే ఆ లోగుట్టు దాగి ఉండే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News