Share News

రోడ్డు ప్రమాద మరణాల్లో 22 శాతం పాదచారులవే

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:23 AM

దేశవ్యాప్తంగా జరిగే రహదారి మరణాల్లో సుమారు 22 శాతం పాదచారులవేనని వక్తలు తెలిపారు.

రోడ్డు ప్రమాద మరణాల్లో 22 శాతం పాదచారులవే

  • పాదచారుల భద్రతకు పెద్ద పీట వేయాలి: నిపుణుల సూచన

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జరిగే రహదారి మరణాల్లో సుమారు 22 శాతం పాదచారులవేనని వక్తలు తెలిపారు. రోడ్డుపై నడవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా నిర్వహిస్తున్న ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ 85వ వార్షిక సదస్సులో ఎంవోఆర్‌టీహెచ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ పంకజ్‌ అగర్వాల్‌, హెచ్‌ఎండీఏ ఎండీ బి. జీవన్‌బాబు, సీఎ్‌సఐఆర్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ ముక్తీ అడ్వానీ, బుందేల్‌ఖండ్‌ ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ సీజీఎం ఏకే జైన్‌లు పాల్గొని ‘‘పట్టణ రవాణా, పాదచారుల హక్కులు - రహదారి భద్రత’’ అంశంపై తమ సూచనలు వెల్లడించారు. పాదచారుల హక్కు రాజ్యాంగబద్ధత... గుజరాత్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పాదచారుల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన సాంకేతిక ప్రమాణాలపై వీరు ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు.


హెచ్‌ఎండీఏ ఎండీ బి. జీవన్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. నగరంలో 120 స్కైవాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలో సికింద్రాబాద్‌ మెట్రో స్టేషన్‌, రైల్వే స్టేషన్‌లను కలుపుతూ స్కైవాక్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. జేఎన్‌టీయూ, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, హైటెక్‌సిటీ వంటి రద్దీ ప్రాంతాల్లో పాదచారుల రక్షణ కోసం త్వరలో స్కైవాక్‌లు నిర్మిస్తామన్నారు. చిన్న ఫుట్‌పాత్‌లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, సరిగా లేని ఫుట్‌పాత్‌లు, ఫుట్‌పాత్‌లపై అడ్డంకుల కారణంగా పాదచారులు ఫుట్‌పాత్‌లను వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. పంకజ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌లో భారీ వాహనాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రూట్‌, డ్రైవర్లకు శిక్షణ, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల వినియోగం పెంచడం కారణంగా గడిచిన ఐదేళ్లలో పాదచారుల మరణాలు 44శాతం తగ్గాయని తెలిపారు. అయోధ్యలో కొన్ని రోడ్లపై వాహనాలను నిషేధించడం, భూగర్భ డక్ట్‌లు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 07:24 AM