Share News

పుస్తకాల సేకరణకు ఐఐటీహెచ్‌ శ్రీకారం

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:11 AM

పది లక్షల పుస్తకాలతో విజ్ఞాన నిధిని నిర్మించేందుకు ‘ప్రజ్ఞాన్‌-ప్రౌద్యోగికీ జ్ఞాన నిధి’ పేరుతో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.

పుస్తకాల సేకరణకు ఐఐటీహెచ్‌ శ్రీకారం
IIT Hyderabad

  • తెలుగు సహా అన్ని భాషలకూ చోటు

  • విరాళంగా స్వీకరించేందుకు సిద్ధం

కంది, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : పది లక్షల పుస్తకాలతో విజ్ఞాన నిధిని నిర్మించేందుకు ‘ప్రజ్ఞాన్‌-ప్రౌద్యోగికీ జ్ఞాన నిధి’ పేరుతో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థలోని నాలెడ్జ్‌ రిసోర్స్‌ సెంటర్‌ (కేఆర్‌సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తక ప్రియులు, రచయితలు, పరిశోధకులు, విద్యావేత్తలు, వ్యక్తిగత గ్రంథాలయాలు కలిగిన వారు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను విరాళంగా అందించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం(స్టెమ్‌)తోపాటు మానవీయ శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను ఈ సేకరణలో భాగంగా స్వీకరించనున్నారు.


తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన లిఖిత ప్రతులు, అరుదైన పుస్తకాలు, ప్రచురణ నిలిపివేసిన గ్రంథాలు, వ్యక్తిగత పుస్తక సేకరణల్లోని విలువైన రచనలను అందించవచ్చు. పుస్తకాలు భౌతికంగా ఏ స్థితిలో ఉన్నా, తెలుగు సహా అన్ని భారతీయ ప్రాంతీయ భాషల పుస్తకాలను విరాళంగా స్వీకరించేందుకు సంస్థ ముందుకొచ్చింది. కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉన్న అరుదైన గ్రంథాలు, పాత పుస్తకాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచనున్నారు. పెద్ద మొత్తంలో పుస్తకాలు అందించే వారికి రవాణా ఏర్పాట్లు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. వివరాలకు ఐఐటీహెచ్‌ నాలెడ్జి రిసోర్స్‌ సెంటర్‌ డిప్యూటీ లైబ్రేరియన్‌ డాక్టర్‌ సి.మల్లికార్జునను 040-23596086, 8331036086 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని ఐఐటీహెచ్‌ అధికారులు కోరారు.


ఈ వార్తలూ చదవండి

వినోదంలో పెను విషాదం.. ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన.. బాధితులకు సీఎం రేవంత్ భరోసా

Updated Date - Oct 19 , 2026 | 06:11 AM