మహిళతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు..
ABN , Publish Date - May 24 , 2026 | 07:37 AM
హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు.
హైదరాబాద్: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కామాంధుడిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పట్టపగలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళతో నిందితుడు నీచంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా ఆమె దుస్తులను పైకెత్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడికి తమదైన స్టైల్లో బుద్ధి చెప్పి కటకటాల వెనక్కి పంపారు.
హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మే 14న రోడ్డుపై ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. తన రెండున్నరేళ్ల చిన్నారిని ప్లేస్కూల్ నుంచి ఆమె ఇంటికి తీసుకెళ్తోంది. అయితే, ఓ కామాంధుడు సదరు మహిళను పాఠశాల నుంచే ఫాలో అవుతూ వెళ్లాడు. అల్కాపూర్ టౌన్‌షిప్ వద్దకు రాగానే ఎవరూ లేని సమయం చూసి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెనుక పైపు నుంచి మహిళ డ్రెస్‌ను ఒక్కసారిగా పైకి ఎత్తాడు. ఆమె వెనక్కి తిరిగి చూసే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడితో మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. కాసేపు నిర్ఘాంతపోయిన బాధితురాలు.. వెంటనే నిందితుడు పరిగెత్తిన వైపునకు వెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. నిందితుడి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో నార్సింగి పోలీసుల దృష్టికి వెళ్లడంతో మే 19న కేసు నమోదు చేశారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు కామాంధుడిని వడ్డె నాగరాజుగా గుర్తించి అరెస్టు చేశారు. అతను ప్రస్తుతం గండిపేట్ పుప్పల్‌గూడలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. నాగరాజుకి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. మరోవైపు నిందితుడికి పోలీసులు తమదైన స్టైల్లో బుద్ధి చెప్పి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి