త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
ABN , Publish Date - May 24 , 2026 | 05:23 AM
దక్షిణ కాశీగా భక్తజన హృదయాల్లో కొలువైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం శనివారం జనసంద్రమైంది.
సరస్వతి అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
శనివారం కిటికిటలాడిన కాళేశ్వర క్షేత్రం
పుష్కర స్నానమాచరించిన మహామండలేశ్వర సంవిధానంద సరస్వతి
భూపాలపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా భక్తజన హృదయాల్లో కొలువైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తటంతో త్రివేణి సంగమం శనివారం జనసంద్రమైంది. ఒక్కరోజే సుమారు 20 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని అధికారులు తెలిపారు. నాసిక్ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ పుష్కర స్నానమాచరించి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం అధికారులు వినూత్నంగా ‘మిస్ట్ ఫాగ్ స్ర్పింక్లర్లు’ ఏర్పాటు చేశారు.
కన్నుల పండుగగా వైదిక కార్యక్రమాలు
పుష్కరాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో జ్ఞాన ప్రదాత అయిన హయగ్రీవ స్వామిని స్మరిస్తూ విద్యా ప్రాప్తి కోసం శనివారం నిర్వహించిన ‘హయగ్రీవ హోమం’ కన్నుల పండుగగా సాగింది. అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి గావించారు. సాయంత్రం వేళ పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హారతి వైభవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. భక్తులకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఘాట్‌ల వద్ద మిస్ట్ ఫాగ్ స్ర్పింక్లర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కురుస్తున్న చల్లని నీటి జల్లులు భక్తుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కాళేశ్వరం ప్రాంతంలో లభించిన పురాతన శిలా సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.20 కోట్లు వెచ్చించి నిర్మించిన మ్యూజియం భక్తులను విశేషం గా ఆకట్టుకుంటోంది. చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించేలా దీనిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పురాతన విగ్రహా లు, వాటి ధార్మిక వివరణలు భక్తులకు సరికొత్త చారిత్రక అవగాహన కల్పిస్తు న్నాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలె క్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్ ఏర్పాట్లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సరస్వతి పుష్కర స్నానా నికి వచ్చిన ఓ భక్తుడు వడదెబ్బతో శనివారం మరణించాడు. పుష్కరఘా ట్‌కు సమీపంలో కిందపడిపోయిన అతడిని గమనించి తోటి భక్తులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.