మమ్మల్ని చూసి భయం
ABN , Publish Date - May 24 , 2026 | 04:15 AM
దేశ యువతలో పెను సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వెబ్‌సైట్ మూతపడింది. అంతేకాదు, సీజేపీ పేరుతో ప్రారంభించిన సోషల్ మీడియా హ్యాండిళ్లన్నింటినీ హ్యాక్ చేశారని, అవి తమ నియంత్రణలో ....
కాక్రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ మూసివేతపై అభిజిత్ దీప్కే.. ఉద్యమం ఆగదని, బొద్దింకలకు మరణం లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 22: దేశ యువతలో పెను సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వెబ్‌సైట్ మూతపడింది. అంతేకాదు, సీజేపీ పేరుతో ప్రారంభించిన సోషల్ మీడియా హ్యాండిళ్లన్నింటినీ హ్యాక్ చేశారని, అవి తమ నియంత్రణలో లేవని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఎక్స్‌లోని తన వ్యక్తిగత హ్యాండిల్ (@abhijeet_dipke)లో ప్రకటించారు. తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్ కూడా హ్యాక్ అయ్యిందన్నారు. ‘నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆన్‌లైన్ పిటిషన్ల ఉద్యమం ప్రారంభించిన మరుసటి రోజే వెబ్‌సైట్‌ను నిలిపివేయటమేగాక మా ఎకౌంట్లను హ్యాక్ చేశారు. పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి బాధ్యుడిని చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది. కానీ, జవాబుదారీతనాన్ని కోరుతున్న మా పార్టీ మీద చర్యలు తీసుకున్నారు. నవ భారత్ అంటే ఇదే’ అని అభిజిత్ పేర్కొన్నారు. పార్టీ సభ్యులుగా ఆన్‌లైన్‌లో 10 లక్షల మంది చేరారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆరు లక్షల మంది పిటిషన్ సమర్పించారని, ఇంతమంది అభిప్రాయాల్ని పక్కనపెడుతూ వెబ్‌సైట్‌ను రద్దు చేయటం కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శమన్నారు. ‘బొద్దింకలంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? ప్రభుత్వ నిరంకుశత్వం భారతదేశ యువత కళ్లు తెరిపిస్తోంది. మాకు మెరుగైన భవిష్యత్తు కావాలని డిమాండ్ చేయటమే మేం చేసిన నేరమా? మీరు అకౌంట్లను హ్యాక్ చేసి నిలిపివేయగలరు కానీ, ఉద్యమాన్ని హ్యాక్ చేయలేరు. మేం ఆగిపోయే ప్రశ్నే లేదు. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎలుగెత్తి చాటుతూనే ఉంటాం. ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉద్యమాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలపై పని చేస్తున్నాం. దాని గురించి వీలైనంత త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. బొద్దింకలకు మరణం లేదు’ అని తెలిపారు. అంతకుముందు అభిజిత్ ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో విడుదల చేశారు. ‘సీజేపీ ఎటువంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే మొత్తం ఉద్యమం మీదే దుష్ప్రచారం చేయాలని, అటువంటి అవకాశం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. కాబట్టి, కాక్రోచ్‌లందరూ శాంతియుతంగా, జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. కాగా, సీజేపీ ఎక్స్ హ్యాండిల్‌ను ఇంతకుముందే నిలిపివేసిన నేపథ్యంలో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే హ్యాండిల్‌ను ఆ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. దీని ఫాలోయర్ల సంఖ్య 20 లక్షలు దాటింది. సీజేపీ ఇన్‌స్టాగ్రాంలో ప్రస్తుతానికి 2 కోట్ల 22 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ఇవి రెండూ కూడా హ్యాకయ్యాయని అభిజిత్ వెల్లడించారు.
జెన్ జీలో పెను సంచలనం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ నెల 17న కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో రాజకీయ వ్యంగ్య ఉద్యమాన్ని అభిజిత్ ప్రారంభించారు. అది యువతలో ముఖ్యంగా జెన్ జీలో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తనకు, తన కుటుంబసభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బీజేపీలో చేరకపోతే తనను చంపుతామని బెదిరిస్తున్నారని.. అయినా, వెనక్కి తగ్గబోనని అభిజిత్ ప్రకటించారు. సీజేపీ వెబ్‌సైట్, ఆన్‌లైన్ హ్యాండిళ్ల మీద జరుగుతున్న దాడిని ‘ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్’ వంటి సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాయి.
కాక్రోచ్ జనతాపార్టీ సభకు అనుమతి నిరాకరణ
ప్రజా సమస్యలపై బెంగళూరు టౌన్‌హాల్ ఎదుట ఆదివారం మానవహారం ఏర్పాటు చేయాలని భావించిన కాక్రోచ్ జనతాపార్టీ ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. వీరి కార్యక్రమానికి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు, పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. టౌన్‌హాల్ ఎదుట కార్యక్రమాలకు అనుమతులు లేవని నగర పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. కాక్రోచ్ జనతా పార్టీ కర్ణాటక పేరిట నిరసన తెలిపేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. యువతకు భవిష్యత్తు లేదని, ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ఇటువంటి అంశాలపైనే టౌన్‌హాల్ ఎదుట ఆందోళన సభ ఉంటుందని ప్రచారం చేశారు. అయితే, పోలీసులు అందుకు అనుమతించలేదు.