Share News

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్

ABN , Publish Date - Jun 19 , 2026 | 08:04 PM

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. జూన్ 21న (ఆదివారం) కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు.

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్
Hyderabad Traffic News

హైదరాబాద్: నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. జూన్ 21న (ఆదివారం) కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. ట్రయల్ రన్ విజయవంతమైతే వారం తర్వాత వన్‌వేను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయని, పనులు జరిగే రోజుల్లో వన్‌వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు జాయింట్ సీపీ చెప్పారు.


గతంలో ఒకసారి ట్రయల్ రన్ నిర్వహించామని, ఈ సందర్భంగా పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులను గుర్తించామని జోయల్ డెవిస్ తెలిపారు. 45 జంక్షన్ వద్ద పీక్ అవర్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. అలాగే డ్రోన్ విజువల్స్‌ను పరిశీలించామని, ప్రయాణికులు, నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ట్రయల్ రన్ ఉంటుందని వెల్లడించారు. ఈ ట్రయల్ రన్‌లో 150 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చారు. నగరవాసులు ట్రాఫిక్ అలర్ట్‌ను గమనించాలని జోయల్ డెవిస్ పేర్కొన్నారు.


కాగా, నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాలను చేపట్టింది. ఇవి పూర్తయితే నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

కర్ణాటక ప్రయోజనాలను కాపాడుకుంటాం.. మేకెదాటుపై ప్రియాంక్ ఖర్గే

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

Updated Date - Jun 19 , 2026 | 09:40 PM